థియేట‌ర్లు తెర‌వ‌క పోయినా... సినిమాల స్క్రీనింగ్ ప్రారంభం!

ABN , First Publish Date - 2020-08-19T12:44:11+05:30 IST

దేశంలో క‌రోనా విజృంభ‌ణ నేప‌ధ్యంలో సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయ‌నేది ఇంకా తేల‌లేదు. అటువంటి పరిస్థితిలో డ్రైవ్ ఇన్‌ సినిమా ఆవిష్కృత‌మ‌య్యింది. ఇది ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌లో ప్రారంభమైంది.

థియేట‌ర్లు తెర‌వ‌క పోయినా... సినిమాల స్క్రీనింగ్ ప్రారంభం!

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా విజృంభ‌ణ నేప‌ధ్యంలో సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయ‌నేది ఇంకా తేల‌లేదు. అటువంటి పరిస్థితిలో డ్రైవ్ ఇన్‌ సినిమా ఆవిష్కృత‌మ‌య్యింది. ఇది ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌లో ప్రారంభమైంది. దీనికి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. కరోనా భయాల నేప‌ధ్యంలో ప్రేక్ష‌కులు తమ కారులో కూర్చుని, పూర్తి భద్రతతో సినిమాల‌ను వీక్షిస్తున్నారు. సినిమా చూడటానికి ఈ పద్ధతి ఇప్పటికే ప‌లుచోట్ల ఉన్నప్పటికీ, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ విధానానికి మ‌రింత ఆద‌ర‌ణ పెరుగుతోంది. 1970 వ దశకంలో అహ్మదాబాద్, ముంబైలలో డ్రైవ్ ఇన్‌ సినిమాలు ఏర్పాటైనా, కొద్ది రోజుల్లోనే వాటిని మూసివేయాల్సివ‌చ్చింది. దేశంలో ప్రస్తుతం ఆరు డ్రైవ్ ఇన్ సినిమాస్ ఉన్నాయి. వాటిలో రెండు గురుగ్రామ్‌లో ఉన్నాయి. గురుగ్రామ్‌లోని డ్రైవ్ ఇన్ థియేటర్ సన్‌సెట్ సినిమా క్లబ్‌లో లాక్‌డౌన్ తర్వాత మొదటి స్క్రీనింగ్‌ను నిర్వహించారు. మాస్కులు ధరించిన ప్రేక్ష‌కులు త‌మ కార్ల‌లో కూర్చుని సినిమాను చూశారు. త‌దుపరి డ్రైవ్-ఇన్ సినిమా షో ఆగస్టు 22, 23 తేదీలలో ఉండ‌‌నుంది. ఈ సంద‌ర్భంగా సన్‌సెట్ సినిమా క్లబ్ ప్ర‌తినిధి సాహిల్ కపూర్ మాట్లాడుతూ ఇలాంటి కాన్సెప్ట్ ద్వారా సినిమాల‌ను సురక్షితంగా చూడ‌వ‌చ్చ‌న్నారు. ఆడియో నేరుగా కారులోకి చేరుకుంటుంద‌ని, వీడియో 30 అడుగుల వెడల్పు గల సినిమా తెరపై కనిపిస్తుంద‌ని తెలిపారు. ప్రేక్ష‌కుల‌ డిమాండ్‌ను అనుస‌రించి, సెప్టెంబర్ నుంచి ప్రతి వారాంతంలో స్క్రీనింగ్ చేసే విష‌య‌మై థియేటర్ యాజ‌మాన్యం పరిశీలిస్తోంద‌న్నారు. 

Updated Date - 2020-08-19T12:44:11+05:30 IST