మల్టీప్లెక్స్‌ సంస్థలకు గిల్డ్‌ ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2020-12-01T06:41:26+05:30 IST

కొవిడ్‌ 19 పరిస్థితుల నుంచి తెలుగు చిత్రపరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సినిమా షూటింగ్స్‌ మొదలయ్యాయి...

మల్టీప్లెక్స్‌ సంస్థలకు గిల్డ్‌ ప్రతిపాదనలు

కొవిడ్‌ 19 పరిస్థితుల నుంచి తెలుగు చిత్రపరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సినిమా షూటింగ్స్‌ మొదలయ్యాయి. అగ్ర హీరోలు సైతం సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు.  థియేటర్లు తెరవడానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కొత్త సినిమాలు విడుదల చేయడానికి లైన్‌ క్లియర్‌ అయింది. ఈ నెల రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకొనే అవకాశం ఉందని అంటున్నారు.  ఆ దిశగా యాక్టివ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ చర్యలు చేపట్టింది. మారిన పరిస్థితుల్లో నిర్మాతలపై భారం తగ్గేలా  చర్యలు తీసుకోవడం కోసం మల్టీప్లెక్స్‌ థియేటర్ల యాజమాన్యాలతో  గిల్డ్‌ చర్చలు ప్రారంభించింది.  ఇందుకోసం కొన్ని ప్రతిపాదనలను మల్టీప్లెక్స్‌ సంస్థల ముందు  ఉంచింది గిల్డ్‌.  విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన ఆ ప్రతిపాదనలివి. 


ఇప్పటివరకూ నిర్మాతలకు, మల్టీప్లెక్స్‌ వారికి మధ్య  రెవెన్యూ షేరింగ్‌ 55:45 (మొదటి వారం), 45:55(రెండో వారం), 40:60 (మూడో వారం), 35:65(నాలుగో వారం) ఉండేది. ఇకపై అలా కాకుండా 60:40(మొదటి వారం), 50:50(రెండో వారం), 40:60(మూడో వారం) ఉండాలి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో  రెవెన్యూ షేరింగ్‌ ఇదే విధంగా ఉండాలి.


నిర్మాతల నుంచి ఇకపై వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు(వీపీఎఫ్‌) వసూలు చెయ్యకూడదు. 

థియేటర్లలో వేసే సినిమా ట్రైలర్స్‌కు నిర్మాతల నుంచి డబ్బు తీసుకోకుండా ఫ్రీగా ప్రదర్శించాలి

షో ప్రయారిటీ కూడా  తెలుగు సినిమాలకే ఇవ్వాలి.

మెయింటెనెన్స్‌ ఛార్జీలు కూడా  నిర్మాతల నుంచి వసూలు చేయకూడదు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలపై గిల్డ్‌కు, మల్టీప్లెక్స్‌ యజమానాలకు మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. వీటిపై మల్టీప్లెక్స్‌ సంస్థలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

Updated Date - 2020-12-01T06:41:26+05:30 IST