రియా చక్రవర్తి బయోపిక్‌ తీసేందుకు చిత్ర నిర్మాతల ఆసక్తి

ABN , First Publish Date - 2020-09-28T15:44:34+05:30 IST

సినీనటి రియా చక్రవర్తి బయోపిక్ నిర్మించేందుకు పలువురు చిత్ర నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.....

రియా చక్రవర్తి బయోపిక్‌ తీసేందుకు చిత్ర నిర్మాతల ఆసక్తి

ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి అనంతరం వార్తల్లో ప్రముఖంగా నిలిచిన అతని ప్రియురాలైన సినీనటి రియా చక్రవర్తి బయోపిక్ నిర్మించేందుకు పలువురు చిత్ర నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. సుశాంత్ సింగ్ కేసు, మాదకద్రవ్యాల వినియోగంపై దర్యాప్తు చేపట్టిన నార్కోటిక్స్ మేనేజ్‌మెంట్ బ్యూరో అధికారులు రియా చక్రవర్తిని అరెస్టు చేసి, అక్టోబరు 6వతేదీ వరకు జుడీషియల్ కస్టడీకి తరలించారు. రియా చక్రవర్తి సినీరంగప్రవేశం నాటి నుంచి సుశాంత్ సింగ్ ప్రేమలో పడిన ఘటనలు, అరెస్టు లాంటి ఆటుపోట్లను సేకరించే పనిలో చిత్ర నిర్మాతలు పడ్డారని బాలీవుడ్ వర్గాల సమాచారం.


రియా చక్రవర్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఈ నెల 29వతేదీన విచారణకు రానుంది. రియా చక్రవర్తి సుశాంత్ ను మోసం చేసిందని సుశాంత్ తండ్రి ఆరోపించారు. మొత్తంమీద సుశాంత్ మృతి అనంతరం రియా చక్రవర్తి వార్తల్లో ప్రముఖంగా వెలుగుతున్న నేపథ్యంలో ఆమె జీవితంపై బయోపిక్ తీసేందుకు పలువురు చిత్ర నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. 


 రియా చక్రవర్తి బాగోతాలపై పత్రికలు, టీవీల్లో పలు ప్రత్యేక కథనాలు వెలువడుతుండటంతో ఆమె వార్తల్లో వ్యక్తిగా మారారు. దీంతో ఆమె వ్యక్తిగత జీవితం డాక్యుమెంటరీతోపాటు ఓ పుస్తకాన్ని కూడా ప్రచురించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ రియాచక్రర్తి బయోపిక్ పై పుస్తకం ప్రచురించేందుకు ఆమెతో కాంట్రాక్టు కుదర్చుకుందని సమాచారం. 

Updated Date - 2020-09-28T15:44:34+05:30 IST