భామను వర్ణించాలంటే.. గుర్తొచ్చేదెవరు?

ABN , First Publish Date - 2020-12-15T01:30:41+05:30 IST

తెలుగుదనాన్ని ఇనుమడింపజేసే చిత్రాలు అందించిన అరుదైన దర్శకుల్లో బాపు ఒకరు. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. డిసెంబర్ 15న

భామను వర్ణించాలంటే.. గుర్తొచ్చేదెవరు?

తెలుగుదనాన్ని ఇనుమడింపజేసే చిత్రాలు అందించిన అరుదైన దర్శకుల్లో బాపు ఒకరు. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. డిసెంబర్ 15న బాపు జయంతి సందర్భంగా ఆయన శైలిని గుర్తు చేసుకుందాం. బాపుగా మనకు సుపరిచితులైన సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ డిసెంబర్ 15, 1933వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం లో జన్మించారు. అరవై అయిదేళ్ల చిత్రకారుడు, యాభై ఏళ్ల చలనచిత్రకారుడు బాపులో ఉన్నారు. 'బాపు బొమ్మ' అనే మాట ఈరోజూ చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. తెలుగు సంస్కృతికీ సంప్రదాయాలకు అందచందాలకు బాపు గీసిన.. తీసిన బొమ్మలు ప్రత్యక్ష సాక్ష్యాలు. సినిమాలపై ఎలాంటి అవగాహన లేకుండానే సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. తొలి చిత్రం 'సాక్షి'తోనే అందరి దృష్టి తనవైపు తిప్పుకున్న ప్రతిభాశాలి బాపు. తనదైన శైలిలో సినిమాలు తీయడమే కాకుండా, తీసిన వాటిన్నింటిలో తనదైన ముద్రను స్పష్టంగా కనబర్చారు.


రామాయణ గాథను పలుమార్లు పలు రూపాల్లో వెండితెరపై అద్భుతంగా మలిచిన ఘనత బాపుది. రామాయణసారం లేకుండా బాపు సినిమాలే లేవు. రామాయణ, మహాభారతాల్ని ఆధునీకరించి పలు సినిమాలు తెరకెక్కించారు బాపు. ఈ రెండు మహాకావ్యాల్ని అణువణువునా జీర్ణించుకుని.. ప్రతి కథనీ ఆకోణం నుంచే చూశారు.. తీశారు.. బాపు. 'సంపూర్ణ రామాయణం', 'సీతా కళ్యాణం', 'ముత్యాల ముగ్గు', 'మనవూరి పాండవులు', 'శ్రీరామ రాజ్యం' వంటి చిత్రాలు రామాయణ, మహాభారత ఇతివృత్తాలతోనే రూపొందాయి. తెలుగులో తాను దర్శకత్వం వహించిన పలు చిత్రాలను హిందీలోనూ తెరకెక్కించారు బాపు. అనిల్ కపూర్ వంటి బాలీవుడ్ నటులను హీరోగా పరిచయం చేసిన ఘనత బాపుదే. ఇక.. బాపు గురించి మాట్లాడుకునేటప్పుడు రమణ గురించి చెప్పకపోతే అది పూర్తవదు. వీరిద్దరూ ఒకే ఆత్మకు రెండు రూపాల వంటి వారు. బాపు దృష్టి అయితే రమణ దాని భావం. బాపు చిత్రం అయితే రమణ దాని పలుకు. అందుకే వీరిద్దరి వెండితెర ప్రయాణమేకాదు. జీవన ప్రయాణం కూడా కలిసి కట్టుగానే సాగింది. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు బాపు 2014, ఆగస్టు 31న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

Updated Date - 2020-12-15T01:30:41+05:30 IST

Read more