దేవుడి కంటే.. మొగుడిగా మేమే బెటర్‌: పూరి

ABN , First Publish Date - 2020-10-14T03:42:08+05:30 IST

'మేము మగాళ్లం.. మా అమ్మలు అనుకునేంత మంచివాళ్లం కాదు. పెళ్లాలు అనుకునేంత దుర్మార్గులం కాదు. ఏదో మధ్యలో ఏడుస్తుంటాం. దయచేసి

దేవుడి కంటే.. మొగుడిగా మేమే బెటర్‌: పూరి

'మేము మగాళ్లం.. మా అమ్మలు అనుకునేంత మంచివాళ్లం కాదు. పెళ్లాలు అనుకునేంత దుర్మార్గులం కాదు. ఏదో మధ్యలో ఏడుస్తుంటాం. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్ హజ్బండ్‌ గానీ, పర్ఫెక్ట్ వైఫ్‌ కానీ ఎవ్వరూ ఉండరు. పెళ్లి అంటేనే ఎడ్జస్ట్‌మెంట్ ఆఫ్‌ ఇండియా..' అని అన్నారు డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. పూరీ మ్యూజింగ్స్‌లో ఆయన 'పర్ఫెక్ట్ హజ్బండ్‌' అనే టాపిక్‌ మీద మాట్లాడారు. శ్రీరాముడి వంటి దేవుడ్ని చేసుకున్న సీతమ్మ వారు కూడా కష్టాలు పడ్డారని పూరీ చెప్పుకొచ్చిన 'పర్ఫెక్ట్ హజ్బండ్‌' విశేషాలేంటో తెలుసుకుందామా.. 


''పెళ్లి అయిన ఆడవాళ్లందరికీ ఓ విన్నపం. జీవితంలో పర్ఫెక్ట్ తండ్రి ఉండవచ్చు.. పర్ఫెక్ట్ తల్లి ఉండవచ్చు.. పర్ఫెక్ట్ డ్రైవర్‌, పర్ఫెక్ట్ నర్సు ఉండవచ్చు కానీ పర్ఫెక్ట్ హజ్బండ్‌ ఎక్కడా ఉండడు. ఇట్స్ ఏ మిథ్‌. నా మొగుడికి ఇలాంటి క్వాలిటీసే ఉండాలి, ఇలాంటి క్యారెక్టరే ఉండాలి.. ఇలాగే ఇలాగే అని మీరు ఎంత పెద్ద లిస్ట్ రాసుకుంటే అన్ని కష్టాల్లో పడిపోతారు. మొగుడ్ని కస్టమైజ్‌ చేయలేం. అందుకే పెళ్లి అయిన ప్రతి ఆడది.. ఏదో ఒక టైమ్‌లో కన్నీళ్లు పెట్టాల్సిందే. తప్పదు. లైఫ్‌లో మిమ్మల్ని చాలా మంది చాలా రకాలుగా ఏడిపిస్తారు. ఎక్కువగా ఏడిపించే అవకాశం మీ మొగుడికే ఉంటుంది. ఎందుకంటే జీవితాంతం ఉంటాడు.. పక్కలోనే ఉంటాడు. మనకి చెప్పకుండా కొన్ని చేస్తాడు, తెలియకుండా కొన్ని చేస్తాడు.. సీక్రెట్‌గా ఇంకొన్ని చేస్తాడు. అందుకే మీకు కాలుద్ది.. తప్పులేదు. కానీ అవే తప్పులు మీ నాన్న కూడా చేస్తాడు. ఎన్ని సార్లు మీ అమ్మ ఏడ్చిందో గుర్తు చేసుకోండి. ఏం.. మీరు మీ నాన్నని క్షమించలేదా? వాళ్లని క్షమించినట్లే.. మీ మొగుడ్ని కూడా క్షమించి వదిలేయండి. 


మీ కంట్లో కన్నీరు చూడకపోతే.. పక్కింటి వదినగారికి అసలు నచ్చదు. ఆవిడ చెప్పే మాటలు విని అనవసరంగా మొగుడితో గొడవ పడవద్దు. పోనీ ఆయన మొగుడేమైనా శ్రీరామచంద్రుడా? కాదే. అందరి పెళ్లాల కంటే ఎక్కువ ఏడ్చింది రాముడి పెళ్లామే. మొగుడు ఎంత గొప్పవాడైతే.. భార్యకి అన్ని కన్నీళ్లు వస్తాయ్‌. ప్రతి దేవుడు వాళ్ల భార్యను ఏడిపించిన వాళ్లే. పెళ్లాం కంట కన్నీళ్లు పెట్టించని ఒక్క దేవుడి పేరు చెప్పండి నాకు. మొగుడి వల్ల కొంత ఏడుస్తారు. వేరే ఆడదాని వల్ల కొంత ఏడుస్తారు. మీకు ఏడవడం వచ్చని తెలిస్తే.. అందరూ మిమ్మల్ని ఏడిపిస్తారు.  అవసరమా?. అందుకే మీరు సుఖంగా ఉన్నట్లు దయచేసి ఏ పిన్నిగారికీ చెప్పవద్దు. కనిపించిన ప్రతిసారీ కష్టాలు చెప్పండి. అమ్మయ్యా.. దీని జీవితం కూడా నాలాగే ఏడిచింది సామీ.. అది చాలు నాకు అని హ్యాపీగా వెళ్లిపోతుంది. 


ఇక తప్పులు చేసే మొగుడ్ని.. మీ అన్నయ్యో.. తమ్ముడో, నాన్నో అనుకుని వదిలేయండి. జీవితంలో ఆ మాత్రం ఏడుపులు మీకు మొగుడు లేకపోయినా ఉంటాయ్‌. మమ్మల్ని కాదని. మీరు నిజంగా సాక్షాత్తూ ఆ దేవుడ్ని పెళ్లి చేసుకుంటే.. మీరు ఇంకా ఇబ్బంది పడతారు. ఎందుకంటే.. ఆ దేవుడు ఇంటికి రాడు. ముళ్లోకాలు తిరుగుతుంటాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా పారిపోతుంటాడు. ఆయన చేసే పనులు చూసి.. ఎందుకు ఆయనని పెళ్లి చేసుకున్నామా అని తలకొట్టుకుని ఏడుస్తారు. ఎంతో కొంత మేమే బెటర్‌. మాతోనే ఎంతో గుట్టుగా.. అలా కాపురాలు కానిచ్చేయండి. ఏవండి.. మేము మగాళ్లం.. మా అమ్మలు అనుకునేంత మంచివాళ్లం కాదు. పెళ్లాలు అనుకునేంత దుర్మార్గులం కాదు. ఏదో మధ్యలో ఏడుస్తుంటాం. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్ హజ్బండ్‌ గానీ, పర్ఫెక్ట్ వైఫ్‌ కానీ ఎవ్వరూ ఉండరు. పెళ్లి అంటేనే ఎడ్జస్ట్‌మెంట్ ఆఫ్‌ ఇండియా.. అంతే..'' అని పూరి చెప్పుకొచ్చారు.  

Updated Date - 2020-10-14T03:42:08+05:30 IST