పరువు హత్యలే ప్రధానాంశం!
ABN , First Publish Date - 2020-07-09T05:39:22+05:30 IST
డిజిటల్ తెరపైకి త్వరలో ఓ తమిళ వెబ్ సిరీస్ రాబోతోంది. ఇటీవల చాలా వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. మరి, దీని ప్రత్యేకత ఏంటంటే... ఇందులో నాలుగు కథలు ఉంటాయి. నలుగురు దర్శకులు వెట్రి మారన్, గౌతమ్ మీనన్, సుధా కొంగర, విఘ్నేశ్ శివన్...

డిజిటల్ తెరపైకి త్వరలో ఓ తమిళ వెబ్ సిరీస్ రాబోతోంది. ఇటీవల చాలా వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. మరి, దీని ప్రత్యేకత ఏంటంటే... ఇందులో నాలుగు కథలు ఉంటాయి. నలుగురు దర్శకులు వెట్రి మారన్, గౌతమ్ మీనన్, సుధా కొంగర, విఘ్నేశ్ శివన్... ఒక్కో కథను ఒక్కొక్కరు తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ నాలుగు కథల సంకలనం (యాంథాలజీ) అన్నమాట. ఒక్కో ఎపిసోడ్ అరగంట నిడివితో ఉంటుందట. కథలు నాలుగు అయినప్పటికీ, ప్రతి కథలో ప్రధానాంశం ఒక్కటే... పరువు హత్య! సెప్టెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని సమాచారం. సుధా కొంగర దర్శకత్వం వహించిన కథలో కాళిదాస్ జయరామ్, ఏఆర్ రెహమాన్ మేనకోడలు-జీవీ ప్రకాశ్ సోదరి భవానీ శ్రీ జంటగా నటించారు. కొడైకెనాల్ నేపథ్యంలో ఆ కథను తెరకెక్కించారట. వెట్రి మారన్ కథలో సాయి పల్లవి, ప్రకాశ్ రాజ్ కనిపించనున్నారు. వాళ్లిద్దరూ తండ్రీకూతుళ్లుగా నటించినట్టు సమాచారం. విఘ్నేశ్ శివన్ కథలో అంజలి, కల్కీ కొచ్చిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల తన పాత్రకు అంజలి డబ్బింగ్ చెప్పారు. గౌతమ్ మీనన్ కథలో నటీనటుల వివరాలను ప్రస్తుతానికి చెప్పలేదు. నెట్‌ఫ్లిక్స్ యాంథాలజీతో పాటు అమెజాన్ కోసం ఆయన ఓ వెబ్ సిరీస్ చేయనున్నారు. చిత్రీకరణలు మొదలైన తర్వాత ప్రారంభం కాబోయే ఆ వెబ్ సిరీస్‌కి పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.