డ్యాన్స్‌ విత్‌ మాధురి

ABN , First Publish Date - 2020-10-23T06:57:31+05:30 IST

‘ఏక్‌ దో తీన్‌...’ ‘తేజాబ్‌’ చిత్రంలోని ఈ పాట చెవినపడితే చాలు మనసు ఉరకలెత్తుతుంది. వెంటనే మాధురీ దీక్షిత్‌, ఆ పాటలో ఆమె డ్యాన్స్‌ మూమెంట్స్‌...

డ్యాన్స్‌ విత్‌ మాధురి

‘ఏక్‌ దో తీన్‌...’ ‘తేజాబ్‌’ చిత్రంలోని ఈ పాట చెవినపడితే చాలు మనసు ఉరకలెత్తుతుంది. వెంటనే మాధురీ దీక్షిత్‌, ఆ పాటలో ఆమె డ్యాన్స్‌ మూమెంట్స్‌ కళ్ల ముందు మెదులుతాయి. ఒకప్పుడు తన అందచందాలతో, నృత్యంతో యూత్‌ను మెస్మరైజ్‌ చేసిన మాధురీ దీక్షిత్‌ ఇప్పుడు తను నేర్చుకొన్న నృత్యాన్ని అందరికీ నేర్పించడానికి ముందుకు వచ్చారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ‘డ్యాన్స్‌ విత్‌ మాధురి’ పేరుతో  ఆన్‌లైన్‌ డ్యాన్స్‌ క్లాసులు ఉచితంగా నిర్వహిస్తున్నారు. పాపులర్‌ గుజరాతీ నృత్యం గర్బ నవరాత్రుల సందర్భంలో బాగా ఫేమస్‌. ఈ కార్యక్రమం ద్వారా రెమో డిసౌజా, పండిట్‌ బిర్జూ మహారాజ్‌ లాంటి ప్రముఖ కొరియోగ్రాఫర్‌లు గర్బ నృత్యంలో ప్రాథమిక అంశాలను, సులభంగా చేయగల కొన్ని నృత్యభంగిమలను నేర్పుతారు. అత్యుత్తమంగా నిలిచిన పదిమంది ‘2020 గర్బ ఎక్స్‌పీరియన్స్‌’ పేరుతో నిర్వహించే ఆన్‌లైన్‌ పోటీలో మాధురీ దీక్షిత్‌, కొరియోగ్రాఫర్ల ముందు తమ ప్రదర్శన ఇస్తారు. ‘డ్యాన్స్‌ విత్‌ మాధురి’ కంటెస్ట్‌ గురించి మాధురీ దీక్షిత్‌ మాట్లాడుతూ ‘‘గర్బ శాస్ర్తీయ నృత్యంలోని కొన్ని స్టెప్స్‌ను ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా నేర్పాలనేదే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇందులో ప్రతిభ కనబరచినవారికి ఫైనల్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తాం. టాప్‌ టెన్‌ ఫైనలిస్టులందరికీ 2019లో విడుదలైన ‘మేడిన్‌ చైనా’ చిత్రంలోని ‘ఓధాని’ పాటకు డ్యాన్స్‌ చేసే అవకాశం లభిస్తుంది. నవరాత్రి పర్వదినాలను ఉత్సాహంగా జరుపుకోవడానికి మునుపటిలా ఈ ఏడాది పెద్దసంఖ్యలో జనం గుమికూడి గర్బ నృత్యం చేయడం వీలుపడదు. ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమం ద్వారా ప్రతిఒక్కరూ తమ ఇళ్లలోనే ఉండి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి సురక్షితంగా ఉత్సాహంగా పండుగను జరుపుకోవచ్చు’’ అన్నారు మాధురి.

Updated Date - 2020-10-23T06:57:31+05:30 IST

Read more