చలో వైజాగ్ అంటున్న 'హిరణ్యకశ్యప'
ABN , First Publish Date - 2020-02-20T22:46:14+05:30 IST
'బాహుబలి' చిత్రంలో భల్లాలదేవుడిగా వణుకు పుట్టించాడు రానా. అయితే, ఇప్పుడు మరోసారి విలన్ పాత్ర పోషించేందుకు సర్వ సన్నద్ధం...

'బాహుబలి' చిత్రంలో భల్లాలదేవుడిగా వణుకు పుట్టించాడు రానా. అయితే, ఇప్పుడు మరోసారి విలన్ పాత్ర పోషించేందుకు సర్వ సన్నద్ధం అవుతున్నాడు. అందుకే, అతి త్వరలో చలో వైజాగ్ అనబోతున్నాడు. అక్కడి రామానాయుడు స్టూడియోస్‌లో నిర్మాత సురేశ్ బాబు భారీ సెట్టింగ్స్ నెలకొల్పబోతున్నారు. ఆ సెట్స్‌లోనే గుణశేఖర్ 'హిరణ్యకశ్యప' చిత్రీకరణ జరగనుంది.
భారీ సెట్స్ వేయించి అద్భుతమైన సినిమాలు తీయటంలో గుణశేఖర్‌ది అందవేసిన చేయి. ఈసారి ఆయన దృష్టి రాక్షస రాజు హిరణ్యకశ్యపుడిపై పడింది. భక్త ప్రహ్లాదుడి కథని, నారసింహా ఆవిర్భావాన్నీ... ఆయన హిరణ్యకశ్యపుడి దృక్కోణం నుంచీ చూపించనున్నాడు. దగ్గుబాటి రానా హిరణ్యకశ్యపుడిగా అలరించే ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. అందుకోసం వైజాగ్ రామానాయుడు స్టూడియోస్‌లో కోట్లు ఖరీదు చేసే సెట్స్ వేస్తున్నారు. నిజానికి ఈ నిర్మాణాలన్నీ హైద్రాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న దగ్గుబాటి వారి స్టూడియోలో జరగాలి. కానీ, తాజాగా సురేశ్ బాబు తమ నానక్ రామ్ గూడ స్టూడియో హౌసింగ్ కమ్యూనిటీగా మార్చేయాలని నిర్ణయించారు. ఇక అక్కడ షూటింగ్స్ జరిగే అవకాశాలు లేవు కాబట్టి రానా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ విశాఖపట్టణానికి తరలిపోయింది. అక్కడి రామానాయుడు స్టూడియోస్‌లోనే గుణశేఖర్ 'హిరణ్యకశ్యప' సినిమా తెరకెక్కించనున్నారు. చూడాలి మరి, ముందుగా 'అరణ్య' సినిమాతో మన ముందుకు రాబోతోన్న... వైజాగ్ 'హిరణ్యకశ్యపుడు' బాక్సాఫీస్ వద్దకి ఎప్పుడు వస్తాడో!