‘ఎంతవరకైనా పోరాడుతా.. నాగ్ క్షమాపణ చెప్పాలి’

ABN , First Publish Date - 2020-12-27T16:29:01+05:30 IST

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఎంతవరకైనా పోరాడుతా.. నాగ్ క్షమాపణ చెప్పాలి’

తిరుపతి : తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు తిరుపతిలో పర్యటించిన ఆయన.. ఇటీవల పూర్తయిన బిగ్‌బాస్-4 షో గురించి మాట్లాడారు. టాలీవుడ్ సీనియర్ హీరో, బిగ్‌బాస్ వ్యాఖ్యాత అక్కినేని నాగార్జున దిగజారుడు మాటలు మాట్లాడారని మండిపడ్డారు.


ఎవరూ సక్సెస్ కాలేరు..!

ఈ సందర్భంగా రాజకీయాల్లోకి వచ్చిన, వస్తున్న సినీ నటులు.. వారి పార్టీల గురించి మాట్లాడిన ఆయన.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ఎంజీఆర్ తప్ప ఇంతవరకూ ఎవరూ సక్సెస్ కాలేదన్నారు. అంతేకాదు భవిష్యత్తులో కూడా సూపర్‌స్టార్ రజినీకాంత్‌, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సహా ఎవరూ సక్సెస్ కాలేరని భ్రమలు పెట్టుకోవద్దని నారాయణ జోస్యం చెప్పారు. కళామాతల్లి సేవ చేసుకుంటున్నారు చేసుకోండి అని నారాయణ చెప్పుకొచ్చారు. ఇవాళ తిరుపతిలో జరిగిన సీపీఐ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మీడియా మీట్ నిర్వహించిన పై వ్యాఖ్యలు చేశారు. అయితే బిగ్‌బాస్ గురించి నారాయణ మాట్లాడటం ఇదేం కొత్త కాదు. ఈయన వ్యాఖ్యలపై ఇంతవరకూ షో యాజమాన్యం కానీ వ్యాఖ్యాత నాగార్జున కానీ స్పందించిన దాఖలాల్లేవ్. ఈసారైనా నాగార్జున స్పందిస్తారో లేకుంటే మిన్నకుండిపోతారో వేచి చూడాల్సిందే.




ఎంతవరకు సమంజసం!

నాకు అక్కినేని నాగార్జున అంటే చాలా అభిమానం. ఆయన సినిమాలు చూస్తుంటాను. కానీ ఆయన బిగ్‌బాస్ షోతో దరిద్రపు పనులు చేశారు.  బిగ్‌బాస్‌లో ముగ్గురు యువతుల ఫోటోలు పెట్టి ఒక యువకుడిని ఎవర్ని కిస్ చేస్తావు..? ఎవరితో డేటింగ్ చేస్తావు..? ఎవరిని పెళ్ళి చేసుకుంటావు..? అని ఓపెన్‌గా అడిగారు. సమాధానమిచ్చిన వ్యక్తి కూడా ఓపెన్‌గా మాట్లాడటం ఎంత అవమానకరం. ఆ ఫోటోల్లో ఆయన ఇంట్లోని మహిళా నటుల ఫోటోలు పెట్టి అడగ్గలడా..?. పద్ధతిగా ఉన్న నాగార్జున ఎందుకిలా చేస్తున్నాడు. ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషన్, కోర్టుకు వెళ్తే.. కనీసం కింది కోర్టులు కూడా కేసులు తీసుకోలేదు. జిల్లా కోర్టుల్లో కూడా కేసులు తీసుకోలేదు. చట్టాలు కూడా భయపడుతుంటే ఏం చేయాలి..?. మనది పితృభూమి కాదు మాతృభూమి మహిళలకు ఇచ్చే స్థానం ఇదేనా..?. మహిళలను ఇంత అన్యాయంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం. నటులు ఎవరూ ఇలా దిగజారి పనులు చేయొద్దు. త్వరలోనే ఈ షోపై హైకోర్టులో కేసు వేస్తాను. ఎంత వరకైనా పోరాడుతాను. నాగార్జున ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలిఅని నారాయణ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-12-27T16:29:01+05:30 IST