తెరపై సీన్‌ మారిపోనుంది!

ABN , First Publish Date - 2020-05-25T08:47:07+05:30 IST

కరోనా వచ్చింది. సమాజంలో, జీవితంలో మార్పు తెచ్చింది. అనుమతిస్తే షూటింగులకు సిద్ధమంటున్న సినీ పరిశ్రమలో కూడా రేపు సెట్లో షూటింగ్‌ నుంచి పబ్లిసిటీ దాకా ఎన్నో మార్పులు రానున్నాయి.

తెరపై సీన్‌ మారిపోనుంది!

కరోనా వచ్చింది. సమాజంలో, జీవితంలో మార్పు తెచ్చింది. అనుమతిస్తే షూటింగులకు సిద్ధమంటున్న సినీ పరిశ్రమలో కూడా రేపు సెట్లో షూటింగ్‌ నుంచి పబ్లిసిటీ దాకా ఎన్నో మార్పులు రానున్నాయి. మునుపటి భారీ బడ్జెట్లు సాధ్యమా? పారితోషికాలు పడిపోతాయా? హాలుకు జనం వస్తారా? ఎగ్జిబిటర్‌కూ, బయ్యర్‌కూ వర్కౌట్‌ అవుతుందా? ఓవర్సీస్‌ సహా సినిమా మార్కెట్‌ సంగతేమిటి? మన సినీ భవిష్యత్‌ చిత్రం ఏమిటి?


ఇంజన్‌ను ఇప్పుడు రీస్టార్ట్‌ చేయాలి. అయితే, ఈసారి కరోనా దెబ్బతో బండి రూటు మారక తప్పదు. సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఇప్పుడు ఇదే! ప్రభుత్వ విధి విధానాలతో అటూ ఇటూగా జూన్‌లో తెలుగు సినిమా షూటింగులు మొదలైపోతాయని అర్థమవుతూనే ఉంది. ఎప్పుడు మొదలైనా ఒక్క షూటింగే కాదు... కథలు, వాటి ప్రచారాలు సహా యావత్‌ పరిశ్రమలోనే సీన్‌ మారిపోనుంది.


స్టార్ల సంగతేమో కానీ...

అయితే, కేవలం కొద్దిపాటి చిత్రీకరణ బాకీ ఉన్న చిన్న సినిమాల వరకు ఓకే కానీ, పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు వెంటనే సెట్లోకి వస్తారనీ, మునుపటి స్థాయిలో షూటింగులు జరుగుతాయనీ ఎవరూ నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. ‘‘ధైర్యంగా షూటింగ్‌ చేసుకోగలవాళ్ళు కొందరు చేస్తారు. కానీ, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘ఆచార్య’ లాంటి పెద్ద ప్రాజెక్టులు వెంటనే చిత్రీకరణ పునః ప్రారంభించడానికి అనేక ఇబ్బందులున్నాయి. భారీ చిత్రాలకు పెద్ద యూనిట్‌ అవసరమవుతుంది. మరోపక్క ఇప్పటికీ కరోనా విజృంభణ తగ్గలేదు. అందుకని స్టార్లు చటుక్కున షూటింగు చేసే రిస్కు తీసుకోకపోవచ్చు’’ అని తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు సి. కల్యాణ్‌ ‘ఆంధ్రజ్యోతి’తో అనుమానం వ్యక్తం చేశారు.


మరో ఏణ్ణర్ధం ఇంతేనా? ఓవర్సీస్‌ కథ కంచికేనా? 

పరిశ్రమలో మార్పులు ఖాయమని మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు. ‘‘సినీరంగం బతకాలంటే, నిర్మాణవ్యయం తగ్గించుకోవడం అనివార్యం కానుంది. బడ్జెట్‌, పారితోషికాలు, జరిగే వ్యాపారం, విడుదల తీరుతెన్నులు - అన్నీ కుదుపునకు లోనై, ఆ కరెక్షన్‌ తరువాత ఒక సర్దుబాటు స్థితికి స్థిరపడతాయి. ఇప్పటికే సెట్‌ మీద ఉన్న సినిమాలతో సహా అన్నిటి ఖర్చులు, ప్లానింగ్‌లు కూడా ఈ రీషఫుల్‌ వల్ల కచ్చితంగా మారతాయి’’ అని సీనియర్‌ నిర్మాత, ‘శ్రీదేవీ మూవీస్‌’ కృష్ణప్రసాద్‌ అన్నారు. పరిశ్రమ మళ్ళీ పుంజుకోవడానికీ, కరోనా మునుపటి స్థితిలో కనీసం డెబ్బై - ఎనభై శాతానికి మళ్ళీ చేరుకోవడానికీ థియేటర్లు తెరిచాక కనీసం ఏణ్ణర్ధం పట్టవచ్చని అంచనా. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒకరిపై ఒకరు ఆధారపడే సినీసీమలో ఎగ్జిబిటర్లు మునుపటిలా అడ్వాన్సులు తెచ్చి కట్టే పరిస్థితి కొన్నాళ్ళు ఉండదు. దాంతో, మినిమమ్‌ గ్యారెంటీ (ఎంజి), నాన్‌ రిటర్నబుల్‌ అడ్వాన్స్‌ (ఎన్‌ఆర్‌ఎ) లాంటి పద్ధతుల్లో సినీవ్యాపారం జరగదు. ‘‘ఒకప్పటి నవయుగ, లక్ష్మీ ఫిలిమ్స్‌ లాగా బలమైన డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌ వ్యవస్థ ఉన్న వారిని ఆసరాగా చేసుకొని, చిత్రనిర్మాణం సాగించే పద్ధతి మళ్ళీ వచ్చే ఛాన్స్‌ ఉంది’’ అని ఆయన అంచనా.


అలాగే, టీవీ ఛానళ్ళ యాడ్‌ రెవెన్యూ పడిపోవడం వల్ల కొద్దికాలం పాటు శాటిలైట్‌ రైట్లకు మునుపటి అంత రేటు రాకపోవచ్చు. మరీ ముఖ్యంగా, తారల పారితోషికాలు ఈ మధ్య బాగా పెరగడానికి తోడ్పడ్డ ఓవర్సీస్‌ మార్కెట్‌ విదేశాల్లోని తాజా పరిస్థితి వల్ల కొన్నాళ్ళు పూర్తిగా కనుమరుగవచ్చు. ‘‘తెలుగు సినిమాకు ఒకప్పుడు ఓవర్సీస్‌ మార్కెట్‌ లేదు. మధ్యలో వచ్చింది. ఉజ్జ్వలస్థాయికి వెళ్ళింది. కానీ, ఈ కరోనా తరువాత ఇప్పుడు కొంతకాలం ఆ మార్కెట్‌ దాదాపు లేకుండా పోతుంది’’ అని ఓవర్సీస్‌ వ్యాపార లావాదేవీలు చూసే సినీజీవి ఒకరు వాపోయారు.


కథలో మార్పు తప్పదా? ఆ సీన్లు ఇక కష్టమేనా?

తెర మీద చెప్పే కథలు కూడా మారాల్సి ఉంటుంది. ఓ.టి.టి.కి అలవాటు పడుతున్న జనాన్ని అందుకు భిన్నంగా థియేటర్లకు రప్పించే కథలు, మెప్పించే మార్గాలను దర్శక, నిర్మాతలు అన్వేషించాల్సి వస్తుంది. వెరసి, కనీసం కొంతకాలం వీలైనంత పరిమిత యూనిట్‌తోనే చిత్రీకరణ సాగుతుంది. తెర మీద కూడా వందల కొద్దీ డ్యాన్సర్లు, ఫైటర్లు, జూనియర్‌ ఆర్టిస్టులు కనిపించడం అనుమానమే. ‘‘ఏ సినిమాకైనా, ఎక్కడైనా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ, ఎలా షూటింగ్‌ చేయాలో కొన్ని పద్ధతులు రూపొందించా’’ అని దర్శక, నిర్మాత తేజ చెప్పారు. వైరస్‌ భయంతో భౌతిక దూరాలు తప్పనిసరి అవడంతో, మునుపటిలా కథలోని ప్రేయసీ ప్రియుల మధ్య ముద్దులు, ఒకరికొకరు సన్నిహితంగా మెలగే ప్రణయ సన్నివేశాలకు నటీనటులు ఏ మేరకు అంగీకరిస్తారు, వాటిని ఎలా చిత్రీకరిస్తారన్నదీ ఆసక్తికరమే!


ఇక... స్టూడియోలేనా స్వర్గసీమ!

కరోనాతో సినీ వ్యాపారమూ తగ్గనుంది. ఆ మేర బడ్జెట్లూ తగ్గాల్సి వస్తుంది. టాప్‌ స్టార్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు తమ రెమ్యూనరేషన్లూ తగ్గించుకోవాల్సి వస్తుంది! ఎంచుకొనే కథాంశాలు, వాటి నేపథ్యాలు కూడా పరిమితులకు గురి కావచ్చు. విదేశీ నేపథ్యాలను ఇప్పుడప్పుడే మర్చిపోవచ్చు. అమెరికాలోనో, ఐరోపాలోనో జరిగిందనుకొనే కథ ఇకపై వీలైనంత వరకు తెలుగు నేల సరిహద్దులు దాటకపోవచ్చు.


ఒకరిని వందగా చూపించే, చిన్నవాటిని కూడా భారీగా పెంచేయగల కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగానికి ఇకపై చేతి నిండా పనే. అలాగే, దేశవిదేశాలకు తిరగడం కష్టమైన నేపథ్యంలో ఏ నేపథ్యానికైనా, ఆర్ట్‌ డైరెక్టర్‌తో దానికి తగ్గ సెట్లు వేయించుకోవడం మళ్ళీ మొదలైపోతుంది. నిన్నటి దాకా అమెరికాకైనా వెళ్ళిన సినీబృందం ఇప్పుడిక పరిమిత ప్రయాణం, పరిమిత జనసంఖ్యతోనే ఇండోర్‌ షూటింగ్‌లతో సరిపెట్టుకోక తప్పదు. అంటే, కెమెరా మళ్ళీ ఒకప్పటిలా స్టూడియోల్లో, ప్రైవేటు హౌసుల్లో నాలుగు గోడల మధ్యకు వచ్చేస్తుంది. కరోనా తరువాత సినిమాలో ఇలా ఎన్ని మార్పులు వచ్చి, కెమెరాను ఎక్కడకు తెచ్చినా, అన్నిటికన్నా కీలకంగా జనం హాలులోకి రావాలి. అది సాధ్యమైతేనే సినిమాకు మనుగడ!

-డాక్టర్ రెంటాల జయదేవ(నవ్య డెస్క్)

Updated Date - 2020-05-25T08:47:07+05:30 IST