కరోనా కాటేసింది... చిత్రసీమ పోరాడింది!

ABN , First Publish Date - 2020-12-29T11:09:19+05:30 IST

వెండితెరపై ప్రేక్షకులకు చిత్రసీమ బొమ్మ చూపించడం కామన్‌! కానీ, ఈ ఏడాది చిత్రసీమకు కరోనా వైరస్‌ అంతకంటే పెద్ద బొమ్మ చూపించింది....

కరోనా కాటేసింది... చిత్రసీమ పోరాడింది!

థియేటర్లలో ఆరు... ఓటీటీల్లో మూడు....

ఈ ఏడాది చిత్రాలు విడుదలైన తీరిది!

వంటలు చేస్తూ కొందరు...

విహారయాత్రలకు వెళ్లినోళ్లు ఇంకొందరు...

ఓ ఇంటివాళ్లు అయినవాళ్లు మరికొందరు...

సెట్‌లో మూడు నెలలు... ఇళ్లల్లో ఆర్నెల్లు...

తారలు సమయాన్ని వెళ్లదీసిన కాలమిది!

కరోనా కాటుకు కకావికలమైన చిత్ర పరిశ్రమను

గాడిన పెట్టే బాధ్యతను భుజాన వేసుకున్న పెద్దలు...

సగటు సినీ సంవత్సరానికి భిన్నంగా 2020 గడిచింది!


వెండితెరపై ప్రేక్షకులకు చిత్రసీమ బొమ్మ చూపించడం కామన్‌! కానీ, ఈ ఏడాది చిత్రసీమకు కరోనా వైరస్‌ అంతకంటే పెద్ద బొమ్మ చూపించింది. ఓ దశలో భయాందోళనలకు గురి చేసిందని చెప్పుకోవాలి. అయితే, సినీ లోకానికి పరిశ్రమ పెద్దలు ధైర్యాన్నిచ్చారు. అసలు సిసలైన సినిమా పరిభాషలో చెప్పాలంటే... 2020లో మొదటి రెండు నెలలు మాంఛి కిక్కిచ్చే ఇంట్రడక్షన్‌ సీన్‌ అనుకుంటే, ఆ తర్వాత నుంచి డిసెంబర్‌ వరకూ ప్రతి నెల క్షణక్షణం ఉత్కంఠకు గురి చేసే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సిన్మా సీన్లను తలపించింది. చివరకు, హ్యాపీ ఎండింగ్‌ లభించింది.


హాఫ్‌ సెంచరీ... అంతే!

గడచిన దశాబ్ద కాలంగా ప్రతి ఏడాదీ థియేటర్లలో స్ట్రయిట్‌ తెలుగు సినిమా సెంచరీ కొడుతూ వస్తోంది. 2011 నుంచి వంద సినిమాలకు తక్కువ ఎప్పుడూ విడుదల కాలేదు. ఆ జోరుకు కరోనా బ్రేకులు వేసింది. ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన స్ట్రయిట్‌ తెలుగు సినిమాలెన్నో తెలుసా? ఇంచుమించు 50 మాత్రమే. అందులో ‘సోలో బ్రతుకే సో బెటర్‌’, ‘మర్డర్‌’, ‘ఏకాంతవేళ’, ‘కరోనా వైరస్‌’ మినహా మిగతావన్నీ మొదటి రెండున్నర నెలల్లో విడుదలైన చిత్రాలే. 2014లో 194, 2019లో 193 సినిమాలు విడుదల కావడానికి తోడు ఏడాది ప్రారంభంలో విజయాల జోరు చూస్తే... డబుల్‌ సెంచరీ టచ్‌ చేస్తుందని అనిపించింది. కానీ, హాఫ్‌ సెంచరీకి  అటు ఇటులో ఈ పరుగు ఆగాల్సి వచ్చింది. ఈ పాపాన్ని మూటగట్టుకున్న పుణ్యం కరోనా మహమ్మారిదే. మార్చిలో లాక్‌డౌన్‌ విధించిన దగ్గర్నుంచి డిసెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు తెరచుకోవడానికి పచ్చజెండా ఊపే వరకూ కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైతే ఒట్టు. దాంతో పరిశ్రమలోని పంపిణీదారులు, ప్రదర్శనకారులు, థియేటర్ల మీద ఆధారపడిన పలు శాఖల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే... థియేటర్లను మళ్లీ తెరవడానికి, ప్రేక్షకులను రప్పించడానికి మన తెలుగు చిత్రసీమ ప్రముఖులు చేసిన కృషి అమోఘం! ప్రతి ఇంట్లో చిన్న చిన్న అలకలు, మనస్ఫర్థలు ఉన్నట్టు మధ్యలో వివాదాలు సహజమే!! చివరకు, శుభం కార్డు వేయడానికి ముందు తెలుగు సినిమాకు ఈ ఏడాది చాలా నేర్పింది. ప్రేక్షకులకు తెలుగు సినిమా ప్రముఖులతో కొత్త వినోదం అందించింది. వెరసి... ఎప్పటికీ మరువలేని గతులు, సంగతులు మిగిల్చింది.


సీజనల్‌ సమ్‌గతులు... సినీ కాలమ్స్‌!

శీతాకాలం, వేసవి కాలం, వర్షాకాలం... మూడు సీజన్లు ఉంటాయి! ఈ ఏడాది ఆయా సీజన్స్‌లో సినిమా ఇండస్ట్రీలో జరిగిన సమ్‌గతులు ఏంటనేది ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే... ఎన్నో ఉన్నాయి. ఎవరూ ఊహించనవి చాలా జరిగాయి!


శీతాకాలంలో వసూళ్ల మంటలు!

సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది ఏదైనా మంచి జరిగిందంటే... అది శీతాకాలంలోనే! ఈ కాలం (జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్‌) లోనే థియేటర్లలో సినిమాలు విడుదల చేయగలిగారు. విజయాల శాతమూ బావుంది. సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల... వైకుంఠపురములో’ సహా ఆ తర్వాత వచ్చిన ‘భీష్మ’, ‘హిట్‌’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. లాభాలను తెచ్చిపెట్టాయి. వసూళ్ల మంటల్లో నిర్మాతలు చలి కాగారని చెప్పడం సబబు. ఈ నెలలో, కరోనా కాలంలో థియేటర్లలోకి వచ్చిన పెద్ద చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ యాభై శాతం ఆక్యుపెన్సీతో మంచి వసూళ్లు సాధిస్తోంది. ‘అశ్వత్థామ’, ‘పలాస’ చిత్రాలకూ మంచి పేరొచ్చింది. అయితే... ‘జాను’, ‘ఎంత మంచివాడవురా’, ‘డిస్కో రాజా’ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అంచనాలను పూర్తిగా అందుకోవడంలో వెనుకబడ్డాయి.వర్షాకాలంలో ఓటీటీ జోరు...

చిన్న చిత్రాలకు ఫుల్‌ హుషారు!

వర్షాకాలం ప్రారంభంలో కేంద్రం అన్‌లాక్‌ ప్రకటించింది. కానీ, థియేటర్లకు వేసిన తాళాలు తీసుకోమని చెప్పలేదు. అన్‌లాక్‌ ప్రకటించి రోజులు గడుస్తున్నా.. థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయో తెలియని పరిస్థితి. దాంతో నిర్మాతలు ఓటీటీ వైపు చూశారు. నెలకు రెండు నుంచి నాలుగైదు చిత్రాలు చొప్పున విడుదలయ్యాయి. అయితే... తొలుత థియేటర్లలో విజయాలు సాధించే అవకాశాలు లేని చిత్రాలను టాలీవుడ్‌ ఓటీటీకి తోసేస్తుందనే టాక్‌ వినిపించింది. ఎందుకంటే... భారీ చిత్రాలు ‘వి’, ‘నిశ్శబ్దం’ వంటివి ఫ్లాప్‌ అయ్యాయి. సూర్య ‘ఆకాశమే నీ హద్దురా’ ఆ మచ్చను చెరిపింది. అయితే... చిన్న చిత్రాలకు ఓటీటీ ఫుల్‌ హుషారు ఇచ్చిందని చెప్పాలి. ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ నుంచి ‘జోహార్‌’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’, ‘కలర్‌ ఫొటో’, ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’, ‘జోహార్‌’ వీక్షకుల మనసులు గెలుచుకున్నాయి. చిన్న చిత్రాల్లోనూ ‘మిస్‌ ఇండియా’, ‘అమరం అఖిలం ప్రేమ’ వంటి పరాజయాలు ఉన్నాయనుకోండి. చిన్న చిత్రాలకు ఓటీటీ ప్రత్యామ్నాయంగా ఎదిగిన కాలమిది.


ఈ ఏడాది ఓటీటీకి ‘డర్టీ హరి’తో ఎంఎస్‌ రాజు మంచి ముగింపు ఇచ్చారు. కరోనా కాలంలో, అదీ సెకండ్‌ వేవ్‌ వస్తుందన్న ఆందోళనల మధ్య... థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? రారా? అనే సందేహాల నడుమ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’తో థియేటర్లలో చిత్రాలు విడుదల చేసుకోవచ్చనే ధైర్యం కలిగించింది. ఈ సినిమా విడుదలకు ముందు ప్రేక్షకులను సినిమా హాళ్లకు రప్పించడానికి ఇండస్ట్రీ అంతా నడుం బిగించింది. థియేటర్లలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రేక్షకుల ఆరోగ్య భద్రత తమదనీ సాయితేజ్‌ చిత్రాన్ని తమ చిత్రంగా భావించి తారలందరూ ప్రచారం నిర్వహించారు. ఓ సినిమా థియేటర్లలో విడుదలవుతున్న సంగతిని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లారు. విజయాలతో 2020ను ప్రారంభించిన తెలుగు చిత్రసీమ... విజయాలతో ముగించి భవిష్యత్తుపై కార్మికులకు భరోసా కలిగించిందని చెప్పుకోవాలి.


వేసవిలో వంటలు... వ్యాయామాలు, వ్యాపకాలు!

శీతాకాలంలో వసూళ్ల చలికాగిన చిత్రసీమ... వేసవిలో మరిన్ని చిత్రాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేసింది. అందులో పవన్‌కల్యాణ్‌ రీ ఎంట్రీ చిత్రం ‘వకీల్‌ సాబ్‌’, ఆయన మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’, రామ్‌ ‘రెడ్‌’, యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా చేసిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’, అనుష్క ‘నిశ్శబ్దం’, నాని, సుధీర్‌బాబుల ‘వి’, సాయితేజ్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ఉన్నాయి. అయితే, కరోనా అందరి ఆశలపై నీళ్లు చల్లింది. థియేటర్లు మూతపటడంతో చిత్రసీమ ఏమీ చేయలేకపోయింది. అయినా... జనాలకు వినోదం అందించింది. ఎలాగంటారా? సామాజిక మాధ్యమాల ద్వారా! ‘బీ ద రియల్‌మెన్‌’ ఛాలెంజ్‌ పుణ్యమా అంటూ ఇంట్లో ఆడవాళ్లకు వంటపని, ఇంటిపనుల్లో సహాయం చేస్తున్న వీడియోస్‌తో హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఇతర మేల్‌ సెలబ్రిటీలు సందడి చేశారు. హీరోయిన్లు వర్కవుట్లు చేస్తున్న వీడియోస్‌ పోస్ట్‌ చేసి ఫిట్‌గా ఉండాలనే మోటివేషన్‌ ఇచ్చారు. వర్కవుట్‌ ఛాలెంజ్‌లూ నడిచాయి. లాక్‌డౌన్‌ ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితిలో ఏప్రిల్‌, మే నెలలు గడిచాయి. సాధారణ ప్రజానీకం తరహాలో సినిమా జనాలు కూడా ఇళ్లకు పరిమితమయ్యారు. వేసవి అంతా కరోనా ఖాతాలో పడింది. ఆ సమయంలోనే ఓటీటీలో సినిమాలు విడుదల చేయాలనే ఆలోచన కొందరికి పుట్టుకొచ్చింది. మే మధ్య (15న)లో అరడజను తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలను విడుదల చేస్తున్నట్టు అమెజాన్‌ ప్రకటించింది. అప్పటికి ఏప్రిల్‌ నెలాఖరులో తెలుగు సినిమా ‘అమృత రామమ్‌’ను ‘జీ 5’ ఓటీటీ విడుదల చేసింది. కానీ, మెజారిటీ తెలుగు సీమ ఓటీటీ వైపు చూడలేదు. జూన్‌లో ‘పెంగ్విన్‌’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’, ‘47 డేస్‌’ చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. ఓ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా శూన్య కాలమిది!


రియల్‌గానూ హీరోలే!

ఎప్పుడూ సినిమాలతో వార్తల్లో నిలిచే హీరోలు... ఈ ఏడాది సేవా కార్యక్రమాలు, విరాళాలు, వితరణతో వార్తల్లో నిలిచారు. రియల్‌గానూ హీరోలే అని నిరూపించుకున్నారు. సోనూ సూద్‌ అయితే సాయంలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. వలస కార్మికులను ఇళ్లకు పంపించడంతో పాటు ఆపదలో ఉన్న ఎందరికో ఆపన్న హస్తం అందించారు. అందుకే ఆయనకు ఏకంగా ఓ గుడి కట్టేశారు. ప్రధానమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కి ప్రభాస్‌ రూ. 3 కోట్లు ఇచ్చారు. ‘మిడిల్‌ క్లాస్‌ ఫండ్‌’ ఏర్పాటు చేసిన విజయ్‌ దేవరకొండ నేరుగా మధ్యతరగతి ప్రజలకు సాయం అందించారు. చిరంజీవి అయితే... కరోనా కారణంగా ఇబ్బందుల్లో పడిన సినీ కార్మికులను ఆదుకోవడానికి ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ ఏర్పాటు చేశారు. దీనికి పరిశ్రమలో పెద్దలు - చిన్నలు తమకు వీలైనంత మేరకు విరాళాలు ఇచ్చారు. దాంతో కార్మికులకు నిత్యావసర సరుకులు అందించారు. ఆపద వస్తే అండగా ఉంటామనే భరోసా ఇచ్చారు. అంతే కాదు... నాగార్జునతో కలిసి పలువురు చిత్రసీమ ప్రముఖులను తీసుకుని చిరంజీవి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. అందరూ కలిసి పరిశ్రమ ఎదుర్కొంటున్న నష్టాలు వివరించి రాయితీలు వచ్చేలా చూశారు. మళ్లీ థియేటర్లు తెరిచే కృషి చేశారు.


ఊహించని వివాహాలు... మాల్దీవుల్లో విహారయాత్రలు!

కరోనా కారణంగా అనుకోకుండా వచ్చిన విరామాన్ని కొందరు తారలు వ్యక్తిగత జీవితానికి ఉపయోగించుకున్నారు. వివాహాలు చేసుకున్నారు. అందులో ఊహించనివే ఎక్కువ. గతేడాది వరకూ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ లిస్టులో ఉన్న రానా, నితిన్‌, నిఖిల్‌ ఈ ఏడాది ఏడడుగులు వేశారు. కొన్నేళ్లుగా పెళ్లి వాయిదా వేస్తున్న రానా... ఈ ఏడాది ఏడడుగులు వేస్తాడని ఎవరూ ఊహించలేదు. కాజల్‌ అగర్వాల్‌ సైతం పెళ్లి విషయం చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చారు. అలాగే, సింగర్‌ సునీత రెండో వివాహ వార్తను ఎవరూ ఊహించలేదు. ఇదీ ప్రేక్షకులకు షాకే. ఇక, వైభవంగా జరిగిన నిహారిక పెళ్లిలో మెగా కుటుంబ కథానాయకులను ఓ ఫ్రేములో ప్రేక్షకులు చూశారు. పెళ్లి తర్వాత కాజల్‌ అగర్వాల్‌ హనీమూన్‌కి మాల్దీవులు వెళ్లారు. ఏడాది ఆఖరులో పెళ్లైన నాగచైతన్య, సమంత సహా ఎక్కువమంది హీరోయిన్లు రకుల్‌, ప్రణీత, తాప్సీ, వేదిక తదితరులు హాలీడేకి వెళ్లినది మాల్దీవులకే! అలా... ఆ సముద్రతీర ప్రాంతం వార్తల్లో నిలిచింది. నిహారిక దంపతులు సైతం మాల్దీవులకు హానీమూన్‌ ట్రిప్‌ వేశారు.

Updated Date - 2020-12-29T11:09:19+05:30 IST