క్యాన్సర్‌ను జయించారు

ABN , First Publish Date - 2020-10-23T07:04:56+05:30 IST

క్యాన్సర్‌ మహమ్మారి భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రతిభావంతులైన నటీనటులను పొట్టన పెట్టుకొంది. కొంతమంది మాత్రం ఆత్మవిశ్వాసంతో...

క్యాన్సర్‌ను జయించారు

సంజయ్‌ దత్‌,   అనురాగ్‌ బసు,   సోనాలి బింద్రే,  మమతామోహన్‌ దాస్‌,   మనీషా కొయిరాల,  గౌతమి


క్యాన్సర్‌ మహమ్మారి భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రతిభావంతులైన నటీనటులను పొట్టన పెట్టుకొంది. కొంతమంది మాత్రం ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్‌తో పోరాడుతూ విజయం సాధిస్తున్నారు. ఎంతోమంది క్యాన్సర్‌ బాధితులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 


పోరాడి గెలిచా...

ఇటీవల క్యాన్సర్‌ బారిన పడి కోలుకుని మళ్లీ లైఫ్‌ని యథావిధంగా కొనసాగిస్తున్నారు సంజయ్‌ దత్‌. రెండు నెలల క్రితం ఆయనకు ఉపిరితిత్తుల క్యాన్సర్‌ మూడో స్టేజీలో ఉందని నిర్ధారణ అయింది. ముంబైలో చికిత్స చేయించుకొన్నారు. చాలా తక్కువ సమయంలో ఆయన కోలుకున్నారు. ‘‘గడిచిన కొన్ని వారాలు నాకు, నా కుటుంబానికి చాలా క్లిష్టమైనవి. దైర్యంగా ఎదుర్కొనే సైనికులకు దేవుడు పెద్ద సమస్యలిస్తాడట. దేవుడు పెట్టిన పరీక్షతో పోరాడి విజేతనయ్యా’’ అని ట్విట్టర్‌ ద్వారా ఆయన తెలిపారు. 


మమతా మోహన్‌ దాస్‌ మల్టీ టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. ఆమె మంచి నటే కాదు చక్కని గాయని కూడా. కథానాయికగా, గాయనిగా కెరీర్‌ పీక్స్‌లో ఉండగా హాడ్కిన్స్‌ లింఫోమా క్యాన్సర్‌ బారిన పడ్డారు. లాస్‌ ఏంజెల్స్‌లో  ఆమె సర్జరీ చేయించుకున్నారు. మూడేళ్లు ఏకధాటిగా  క్యాన్సర్‌ తో పోరాడి తర్వాత క్రమంగా  కోలుకున్నారు. అయితే ఆమె మామూలు మనిషి కావడానికి పదేళ్ల సమయం పట్టింది. ‘‘నా వయసు చాలా తక్కువ.  సాధించాల్సింది ఎంతో ఎక్కువ ఉందనే సంకల్పబలమే  నన్ను క్యాన్సర్‌  బారి నుంచి రక్షించింది. అయితే ఈ పదేళ్లలో ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. నా తల్లిదండ్రులు, కజిన్స్‌ నాకు ఈ సమయంలో అండగా, ప్రోత్సాహకరంగా ఉన్నారు’’ అని గత ఏడాది ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా  మమతా తెలిపారు. 


కొత్త జీవితం మొదలైంది

అందం, అమాయకత్వం కలబోసిన కథానాయిక మనీషా కొయిరాల. తెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోసిన ఆమెకు 2012 నవంబర్‌లో ఒవేరియన్‌ క్యాన్సర్‌ వ్యాధి సోకిందని నిర్థారణ అయింది. ముంబైలో ప్రాథమికంగా చిక్సిత చేయించుకొన్న తర్వాత ఆమె న్యూయార్క్‌ వెళ్లి సర్జరీ చేయించుకున్నారు. అక్కడే ఆరు నెలలు ఉండి చికిత్స పొంది ఇండియాకు తిరిగొచ్చారు. ‘‘దాదాపు 11 గంటలపాటు జరిగిన సర్జరీ సక్సెస్‌ అయింది. దానికన్నా 18 సెషన్లు కీమోథెరపీ చేయించుకోవడం చాలా కష్టంగా అనిపించింది. నాలుగేళ్లలో సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడ్డా. క్యాన్సర్‌ నుంచి కోలుకోవడంతో నాకు కొత్త జీవితం మొదలైంది’’ అని మనీషా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2015 నుంచి మనీషా మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. 


ప్రతి రోజుకీ లెక్క ఉంటుంది..

అలనాటి అందాల తార గౌతమికి 35 ఏళ్ల వయసులో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ సోకింది. అయినా కోలుకోవాలనే కృతనిశ్చయంతో ధైర్యంగా వ్యాధితో పోరాటం చేశారామె. క్యాన్సర్‌ బారీ నుండి బయటపడడానికి కొంత సమయం పట్టినా ఇప్పుడు గౌతమి ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె కోలుకోవడం వెనక  కూతురు సుబ్బలక్ష్మి మోటివేషన్‌ చాలా ఉందని ఆమె చెబుతుంటారు. ‘‘క్యాన్సర్‌తో పోరాటం జీవితం పట్ల నా దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. ఇకపై నేను దేనికీ భయపడేది లేదు. ప్రతి రోజుకీ ఓ లెక్క ఉంటుంది. మనదైన రోజుని ఆనందంగా ఆస్వాదించామా లేదా అన్నదే ఇప్పుడు ఆలోచిస్తున్నా. దినచర్యలో చిన్నచిన్న మార్పులు చేయడం వల్ల జీవితం విలువ పెరుగుతుందని తెలుసుకున్నా’’అని గౌతమి అంటారు. 


కష్టమని చెప్పినా...

‘మర్డర్‌’, ‘బర్ఫీ’, ‘గ్యాంగ్‌స్టర్‌’ చిత్రాల దర్శకుడు అనురాగ్‌ బసు కూడా క్యాన్సర్‌ను జయించారు. 2004లో ఆయన బ్లడ్‌ క్యాన్సర్‌ బారిన పడ్డారు. అయినా తనని క్యాన్సర్‌ ఏమీ చేయలేదనే ధైర్యమే ఆయన్ని ముందుకు నడిపించింది.  డాక్టర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్‌ ఉందని చెప్పినా ఆయన అధైర్యపడలేదు.  తన పనిని ఆపలేదు. ఒక పక్క ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే సినిమాలకు పని చేశారు. చివరకు ఆయన ధైర్యమే క్యాన్సర్‌ నుంచి కోలుకునేలా చేసింది. ‘‘జీవితం చాలా చిన్నది. దానిని ఆనందంగా అనుభవించాలి. నాకు దేని గురించి భయం లేదు. నా ధైర్యమే నాకు సగం బలం. అదే నన్ను బ్లడ్‌ క్యాన్సర్‌ నుంచి రక్షించింది’’ అని అనురాగ్‌ చెబుతారు. 


తెలుగులో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన సోనాలి బింద్రే 2018 జూలైలో క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని అప్పట్లో ఆమే స్వయంగా ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. న్యూయార్క్‌లోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందారు. చికిత్స సమయంలో నరకం అనుభవించాననీ, కంటి చూపు దెబ్బతిందనీ ఆమె వెల్లడించారు. ఆ తర్వాత ఏదో అయిపోతుందనే భయాన్ని వీడనాడి ఆత్మస్థైర్యంతో ఆమె చికిత్సను కొనసాగించి పూర్తిగా కోలుకున్నాక గతేడాది డిసెంబర్‌లో ఇండియాకు తిరిగొచ్చారు. క్యాన్సర్‌ను జయించిన సోనాలి మళ్లీ తన రొటీన్‌ లైఫ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సమయంలో భర్త ఎంతో అండగా ఉన్నారని సోనాలి చెబుతుంటారు. ఇప్పుడు ఎంతోమంది క్యాన్సర్‌ బాధితులకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 


అలాగే హృతిక్‌ రోషన్‌ తండ్రి రాకేశ్‌ రోషన్‌, కథానాయిక లీసా రే, ఆయుష్మాన్‌ ఖురానా భార్య తహిరా కశ్యప్‌వంటివారు కూడా క్యాన్సర్‌ను జయించిన వారిలో ఉన్నారు.

Updated Date - 2020-10-23T07:04:56+05:30 IST

Read more