హాలీవుడ్‌...రంగు మరకను తుడిచే ప్రయత్నమా!?

ABN , First Publish Date - 2020-11-17T11:51:04+05:30 IST

హాలీవుడ్‌లో వర్ణ వివక్ష గురించి నాలుగేళ్ల క్రితం (2016లో) పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందుకు, ఆస్కార్‌ నామినేషన్లు కారణమని చెప్పాలి. పురస్కారాలను తెల్ల జాతీయులకు కట్టబెట్టడానికి నామినేషన్లలో వాళ్లకు మాత్రమే చోటు ఇచ్చారని ఎరుపెక్కిన

హాలీవుడ్‌...రంగు మరకను తుడిచే ప్రయత్నమా!?

సినిమా...రంగు రంగుల ప్రపంచం!

అందులో...ఆధిపత్యం ప్రపంచ సినిమా పెద్దన్న హాలీవుడ్‌దే!

అయితే...కుటుంబ పెద్ద వర్ణ వివక్ష చూపిస్తున్నాడనేది ఓ విమర్శ!

ఇప్పుడు...పెద్దన్న రంగు మరకను తుడిచే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు!


హాలీవుడ్‌లో వర్ణ వివక్ష గురించి నాలుగేళ్ల క్రితం (2016లో) పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందుకు, ఆస్కార్‌ నామినేషన్లు కారణమని చెప్పాలి. పురస్కారాలను తెల్ల జాతీయులకు కట్టబెట్టడానికి నామినేషన్లలో వాళ్లకు మాత్రమే చోటు ఇచ్చారని ఎరుపెక్కిన కళ్లతో నల్లగొంతు సూటిగా బాణం సంధించింది. ‘ఆస్కార్స్‌ ఆర్‌ సో వైట్‌’ అని విమర్శించింది. మౌనంగా ఉన్న మనుషులు ఒక్కసారిగా మాటల్లో పదును పెంచారు. ఆ ధాటికి మరుసటి ఏడాది (2017లో) ఆస్కార్‌ నామినేషన్లలో నల్ల జాతీయులకూ చోటిచ్చారు. ఇప్పుడు హాలీవుడ్‌ భారీ బడ్జెట్‌ చిత్రాల్లోనూ నల్ల జాతీయులు సహా వివిధ దేశాల నటీనటులకు చోటిస్తున్నారు. ‘ఇదంతా రంగు మరకను తుడిచే ప్రయత్నమా?’ - ఏది ఏమైతేనేమి... ప్రపంచ సినిమా తెరపై అన్ని వర్ణాల, దేశాల నటీనటులను చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతోంది.


హాలీవుడ్‌ నటీనటుల్లో ఎక్కువ శాతం మంది తెల్ల జాతీయులే! అయితే అమెరికన్లు... లేదంటే బ్రిటీషర్లు, ఆస్ట్రేలియన్లు ఉంటారు. 2016లో చేసిన ఓ సర్వే ప్రకారం హాలీవుడ్‌ నటీనటుల్లో తెల్ల జాతీయులు 78.1 శాతం మంది ఉన్నారు. మరి, నల్ల జాతీయుల శాతమెంతో తెలుసా? 12.5 మాత్రమే. దర్శకుల విషయానికొస్తే... పదిమందిలో ఒక్కరే నల్ల జాతీయుడు ఉన్నారు. ‘బ్లాక్‌ పాంథర్‌’ ఫేమ్‌, ఈ ఏడాది మరణించిన ఛాడ్విక్‌ బోస్‌మన్‌, మరో బ్లాక్‌ హీరో డెంజిల్‌ వాషింగ్టన్‌ సహా విల్‌ స్మిత్‌, ఎడ్డీ మర్ఫీ, హాలె బెర్రీ, మోర్గాన్‌ ఫ్రీమ్యాన్‌, వివోలా డెవీస్‌, శామ్యూల్‌ జాక్సన్‌, ఎడ్రిస్‌ ఎల్బా వంటి నల్ల జాతీయులు భారీ విజయాలు సాధించినప్పటికీ వర్ణ వివక్ష తగ్గలేదు. తరతరాలుగా అమెరికన్‌ మట్టిలో నాటుకుపోయిన తెల్ల జాతీయుల పెత్తందారీ ధోరణికి తోడు హాలీవుడ్‌లో నల్ల జాతీయులకు ప్రాతనిధ్యం వహించేవారి సంఖ్య తక్కువగా ఉండటమూ అందుకు కారణమేమో!? నాలుగైదు ఏళ్లుగా వివక్షపై గొంతెత్తి మాట్లాడుతున్నోళ్ల సంఖ్య పెరిగింది. దానికి తోడు ప్రపంచ ప్రేక్షకులూ హలీవుడ్‌ చిత్రాలను ఎక్కువ చూస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆయా దేశాల తారలను తీసుకుంటున్నారు. ప్రియాంకా చోప్రా, ఇర్ఫాన్‌ ఖాన్‌, అలీ ఫజల్‌, రణదీప్‌ హుడా, పంకజ్‌ త్రిపాఠీ వంటి భారతీయ నటీనటులకూ హాలీవుడ్‌ చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు. గతంతో పోలిస్తే ఇప్పుడు హాలీవుడ్‌ నటీనటుల ఎంపికలో రంగు వైవిధ్యం కనపడుతోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌ చిత్రాల్లో ప్రధాన పాత్రలకు అన్ని వర్ణాల వారినీ తీసుకుంటున్నారు.


జేమ్స్‌ బాండ్‌గా ఎడ్రిస్‌ ఎల్బా?

జేమ్స్‌ బాండ్‌ ఫ్రాంచైజీలో 25వ చిత్రం ‘నో టైమ్‌ టు డై’ తర్వాత 007 పాత్రలో నటించనని డేనియల్‌ క్రేగ్‌ స్పష్టం చేశారు. మరి, ఆయన తర్వాత బాండ్‌గా కనిపించేది ఎవరు? ఎడ్రిస్‌ ఎల్బా పేరు వినపడుతోంది. గతంలోనూ బాండ్‌గా ఎడ్రిస్‌ పేరు వినిపించింది. అయితే... ఆ ప్రచారం వచ్చిన ప్రతిసారీ రంగుకు సంబంధించిన చర్చ సైతం తప్పక జరిగేది. దానిపై ఎడ్రిస్‌ బాధపడ్డారు. అయితే... ఈసారి ఆయన బాండ్‌గా తెరపైకి రావడం దాదాపు ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. ‘అవేంజర్స్‌’, ‘థార్‌’ చిత్రాల్లో ఆయన నటించారు. ఆ విజయాల్లో ఆయన పాత్ర ఉంది. అయితే, ఇప్పటివరకూ జేమ్స్‌ బాండ్‌గా తెల్ల జాతీయులే నటించారు. నల్ల జాతీయుడైన ఎడ్రిస్‌ నటిస్తే... చరిత్రే!


సిము లూ...తొలి ఏసియన్‌ మార్వెల్‌ హీరో!

మార్వెల్‌ కామిక్స్‌ క్యారెక్టర్‌ షాంగ్‌-చి ఆధారంగా రూపొందిన అమెరికన్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘షాంగ్‌-చి అండ్‌ ద లెజెండ్స్‌ ఆఫ్‌ ద టెన్‌ రింగ్స్‌’. ఇందులో షాంగ్‌-చి పాత్రలో చైనీ్‌స-కెనడియన్‌ యాక్టర్‌ సిము లూ నటిస్తున్నారు. ఓ ఏసియన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి మార్వెల్‌ చిత్రం ఇదే కావడం గమనార్హం. అతని ఎంపికపై కొన్ని భిన్నాభిప్రాయాలు వినిపించాయి. ఆ సమయంలో ‘‘మన శరీర రంగు వల్ల మనల్ని విమర్శించిన వాళ్లు లేదా రంగు వల్ల మనల్ని మనం తక్కువగా భావించుకునేలా చేసినవాళ్లు... ఇకపై ఉండరు’’ అని ఫేస్‌బుక్‌లో సిము లూ పేర్కొన్నారు. ఇదే చిత్రంలో చైనీ్‌స-అమెరికన్‌ అక్వాఫినా సైతం నటించారు.


స్నేక్‌ ఐస్‌...హెన్రీ గోల్డింగ్‌!

‘క్రేజీ రిచ్‌ ఏసియన్స్‌’ (2018)తో హాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మలేషియన్‌ హెన్రీ గోల్డింగ్‌. వచ్చే ఏడాది విడుదల కానున్న ‘స్నేక్‌ ఐస్‌’లో అతను టైటిల్‌ రోల్‌ పోషించాడు. దీన్నో సూపర్‌హీరో మూవీలా కాకుండా మార్షల్‌ ఆర్ట్స్‌ ఫిల్మ్‌లా తీశారని హెన్రీ గోల్డింగ్‌ తెలిపారు. 


లుపిటా న్యూంగో... ‘ద 355’లో!

లుపిటా న్యూంగో... కెన్యా-మెక్సికన్‌ నటి. హాలీవుడ్‌ టీవీ సీరియళ్లు (స్టార్‌ వార్స్‌), చిత్రాల్లో నటించారు. అంతకు ముందు కొన్ని చిత్రాలకు ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా పని చేశారు. ‘ఇన్‌ మై జీన్స్‌’ డాక్యుమెంటరీకి ఆమె దర్శక-నిర్మాత, రచయిత. అమెరికన్‌ స్పై ఫిల్మ్‌ ‘ద 355’లో లుపిటా న్యూంగోకి ఓ ప్రధాన పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఆమెది గూఢచారిగా కంప్యూటర్‌ స్పెషలిస్ట్‌ పాత్ర.

Updated Date - 2020-11-17T11:51:04+05:30 IST