నృత్యదర్శకుడు జానీ హీరోగా...

ABN , First Publish Date - 2020-12-29T09:51:14+05:30 IST

నృత్యదర్శకుడు జానీ హీరోగా పరిచయమవుతున్న చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. జానీ, హీరోయిన్‌ దిగంగనా సూర్యవంశీపై...

నృత్యదర్శకుడు జానీ హీరోగా...

నృత్యదర్శకుడు జానీ హీరోగా పరిచయమవుతున్న చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. జానీ, హీరోయిన్‌ దిగంగనా సూర్యవంశీపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి నాగబాబు కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా... వీవీ వినాయక్‌ క్లాప్‌ ఇవ్వడంతో పాటు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఎంతో ప్రతిభ, అందం కల జానీ హీరోగా నిలదొక్కుకుంటాడని నమ్ముతున్నా. హీరోగా పేరు, భారీ విజయాలు వచ్చినా... కొరియోగ్రఫీని మాత్రం వదలొద్దు’’ అని జానీకి నాగబాబు సలహా ఇచ్చారు. జానీ మాట్లాడుతూ ‘‘నాకు కొరియోగ్రఫీ అంటే ఇష్టం. తర్వాత దర్శకత్వం. దర్శకుడు మురళీరాజ్‌ తియ్యాన నా దగ్గరకు వచ్చినప్పుడు అదే విషయం చెప్పా. అయినా... 45 రోజులు వెంటపడ్డాడు. అప్పుడు కథ విన్నాను. విన్నాక సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. కొరియోగ్రఫీ వర్క్‌ లేనప్పుడు టీవీ షూటింగులకు వెళతా. ఇప్పుడు ఈ సినిమా షూటింగు చేస్తా. నేను చేయకపోతే ఈ సినిమా చేయనన్న మా నిర్మాత వెంకటరమణగారికి, నాతో నటించడానికి అంగీకరించిన దిగంగనాకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘డ్యాన్స్‌ బేస్డ్‌ సినిమా కాదిది. పక్కా లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌’’ అని దర్శకుడు మురళీరాజ్‌ వెల్లడించారు. ‘‘మాది విశాఖ. జానీ మాస్టర్‌ అంటే ముందునుంచీ అభిమానం’’ అని సుజి విజువల్స్‌ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్న వెంకటరమణ .కె చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత లగడపాటి శ్రీధర్‌, యాంకర్‌ ప్రదీప్‌ పాల్గొన్నారు. హీరో జానీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ చిత్రానికి మాటలు: యశోద గౌరీ శంకర్‌, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె. నాయుడు, సంగీతం: రధన్‌.

Updated Date - 2020-12-29T09:51:14+05:30 IST