చలో ఓటీటీ!

ABN , First Publish Date - 2020-08-17T05:51:12+05:30 IST

అమితాబ్‌బచ్చన్‌, ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’, విద్యాబాలన్‌ ‘శకుంతలా దేవి’, జాన్వీ కపూర్‌ ‘గుంజన్‌ సక్సేనా’ తదితర చిత్రాలు ఓటీటీ ద్వారా విడుదలై ప్రేక్షకాదరణ పొందాయి...

చలో ఓటీటీ!

అమితాబ్‌బచ్చన్‌, ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’, విద్యాబాలన్‌ ‘శకుంతలా దేవి’, జాన్వీ కపూర్‌ ‘గుంజన్‌ సక్సేనా’ తదితర చిత్రాలు ఓటీటీ ద్వారా విడుదలై ప్రేక్షకాదరణ పొందాయి. అక్షయ్‌కుమార్‌ ‘లక్ష్మీబాంబ్‌’ అజయ్‌ దేవగణ్‌ ‘భుజ్‌’, సంజయ్‌దత్‌ దత్‌, ఆలియాభట్‌ నటించిన ‘సడక్‌2’ చిత్రాలు త్వరలో ఓటీటీల్లో విడుదల కానున్నాయి. తెలుగులో కూడా ఈ ట్రెండ్‌ మొదలు కానుంది. ఇప్పటికే ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’, ‘భానుమతి రామకృష్ణ’ వంటి మినిమమ్‌ బడ్జెట్‌ సినిమాలు ఓటీటీల్లో సందడి చేశాయి. కానీ తెలుగులో పెద్ద సినిమా ఏదీ ఓటీటీలో విడుదల కాలేదు. ఇప్పుడు స్టార్‌ హీరోల సినిమాలు కూడా ఈ వేదికల్లో దర్శనమివ్వబోతున్నాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా రూపొందిన ‘వి’ చిత్రం త్వరలో ఓటీటీలో విడుదల కానుందని సమాచారం.


దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రానికి సుమారు 35 కోట్లు ఆఫర్‌ వచ్చిందని వినికిడి. అన్నీ ఓకే అయితే తెలుగులో ఇంత వ్యయంతో రూపొంది, ఓటీటీలో విడుదలవుతున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. ఇందులో నాని తొలిసారి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. వచ్చేవారంలో ట్రైలర్‌ విడుదల చేస్తారు. అలాగే మరో రెండు సినిమాలూ ఓటీటీ విడుదలకు సై అంటున్నాయని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. సాయితేజ్‌ హీరోగా సుబ్బు వేదుల దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ఓటీటీ మాధ్యమం ద్వారా ప్రేక్షకుల ముందుకురానుందని తెలిసింది. అయితే నిర్మాణ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 


కీర్తీ సురేశ్‌ ప్రధాన పాత్రలో నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో మహేశ్‌ కోనేరు నిర్మించిన ‘మిస్‌ ఇండియా’ ఏప్రిల్‌లో విడుదల కావాలి. లాక్‌డౌన్‌ వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఆ చిత్రం కూడా ఓటీటీ బాట పట్టినట్లు సమాచారం. ఈ చిత్రాలన్నీ ఓటీటీల్లో విడుదలై సక్సెస్‌ సాధిస్తే మున్ముందు భారీ చిత్రాలు కూడా ఇదే వేదికను ఎంచుకుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. రవితేజ ‘క్రాక్‌’ చిత్రం ఓటీటీ ద్వారా విడుదల కానుందని వస్తున్న వార్తలను దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఖండించారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని థియేటర్‌లలో విడుదల చేయాలా? ఓటీటీలో విడుదల చేయాలా అని చిత్ర రచయిత, నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్‌ ట్విట్టర్‌లో పోల్‌ నిర్వహించారు. 19048 మంది నెటిజన్లు ఓటు వేయగా, 56శాతం మంది ఓటీటీలో, 29శాతం థియేటర్లలో విడుదలకు, 15 శాతం ఎక్కడైనా పర్లేదు సినిమా విడుదల కావడమే ముఖ్యమని ఓటు వేశారు. 

Updated Date - 2020-08-17T05:51:12+05:30 IST