నడిగర్‌ సంఘానికి మళ్లీ ఎన్నికలు జరపాల్సిందే

ABN , First Publish Date - 2020-02-18T14:34:32+05:30 IST

దక్షిణ భారత నడిగర్‌ సం ఘం కార్యవర్గ ఎంపికకు మళ్లీ ఎన్నికలను జరిపేందుకు ఎటువంటి నిషేధం లేదని మద్రాస్‌ హైకోర్టు

నడిగర్‌ సంఘానికి మళ్లీ ఎన్నికలు జరపాల్సిందే

చెన్నై : దక్షిణ భారత నడిగర్‌ సం ఘం కార్యవర్గ ఎంపికకు మళ్లీ ఎన్నికలను జరిపేందుకు ఎటువంటి నిషేధం లేదని మద్రాస్‌ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. నడిగర్‌ సంఘానికి గతేడాది జూన్‌ 23వ తేదీన ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. కానీ, ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ సంఘాల రిజిస్ర్టార్‌ ఉత్వర్వులు జారీచేశారు. దీనిని వ్యతిరేకిస్తూ నటుడు విశాల్‌ హైకోర్టు పిటీషన్‌ వేయగా, విచారణ జరిపిన న్యాయస్థానం.. ముందుగా నిర్ణయించిన ప్రకారం జూన్‌ 23న ఎన్నికలు జరపాలని, అయితే తదుపరి ఉత్తర్వులు జారీచేసేవరకు ఓట్ల లెక్కింపు జరుపకూడదని స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఎన్నికలు జరిగాయి. 


ఈ నేపథ్యంలో బెంజమిన్‌, ఏళుమలై అనే సభ్యులు దాఖలు చేసిన మరో పిటిషన్‌లో.. నడిగర్‌ సంఘానికి జరిగిన ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు తమను అనుమతించలేదని, పొరుగు ప్రాంతాల్లో ఉన్న సంఘం సభ్యులు పోస్టర్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉందని, అయితే ఎన్నికల ముందు రోజు వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లు తమకు పంపిం చలేదని, అందువల్ల ఈ ఎన్నికలను రద్దు చేయాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అదే విధంగా నడిగర్‌ సంఘాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక సంఘాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకంగా ఆ సంఘ అధ్యక్షుడు నాజర్‌, కోశాధికారి కార్తీ తరపున పిటిషన్లు దాఖలయ్యాయి. వీటినై విచారణ జరిపిన న్యాయమూర్తి నడిగర్‌ సంఘా నికి 2019, జూన్‌ 23వ తేదీ నిర్వహించిన ఎన్నికలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.


అలాగే మూడు నెలల్లోపు కొత్త ఓటర్లు జాబితా రూపొందించి, ఎన్నికలు నిర్వహించాలని, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోకుల్‌దాస్‌ ఎన్నికల నిర్వహణ అధికారిగా వ్యవహ రిస్తారని వెల్లడించారు. అంతేకాకుండా, నడిగర్‌ సంఘా నికి మళ్లీ ఎన్నికలు పూర్తి చేసేవరకు ఆ సంఘ నిర్వాహక బాధ్యతలను ఇప్పుడున్న ప్రత్యేక అధికారి గీత చేపడతారని, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను త్రోసిపుచ్చుతూ ఉత్తర్వులిచ్చారు. ఈ నేపథ్యంలో.. నడిగర్‌ సంఘం ఎన్నికలను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ విశాల్‌ తరపున అప్పీలు పిటిషన్‌ దాఖలైంది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తూ, ఓట్ల లెక్కింపు జరిపేలా ఉత్తర్వులు జారీచేయాలని ఈ పిటిషన్‌లో కోరారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నడిగర్‌ సంఘానికి కొత్త ఎన్నికలు నిర్వహిం చాల్సిందేనని తేల్చిచెప్పింది. ఎన్నికలకు సంబంధించిన పనులను కూడా చేపట్టవచ్చని న్యాయస్థానం ఆదేశిం చగా, నడిగర్‌ సంఘానికి వ్యతిరేకంగా దాఖలైన అప్పీలు పిటిషన్‌ విచారణను ఈనెల 20కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Updated Date - 2020-02-18T14:34:32+05:30 IST