కంగనాకు వై కేటగిరీ భద్రత కేటాయింపు.. కారణం ఇదే..!

ABN , First Publish Date - 2020-09-07T18:04:59+05:30 IST

బాలీవుడ్‌లో ముక్కుసూటితనంతో వ్యవహరిస్తూ వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న...

కంగనాకు వై కేటగిరీ భద్రత కేటాయింపు.. కారణం ఇదే..!

ముంబై: బాలీవుడ్‌లో ముక్కుసూటితనంతో వ్యవహరిస్తూ వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించినట్లు తెలిసింది. ఆది నుంచి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ.. ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ బోల్డ్ బ్యూటీ సుశాంత్ మరణం తర్వాత తన కామెంట్లతో, ట్వీట్స్‌తో మరింత చర్చకు తెరలేపింది.


బాలీవుడ్‌లో నెపోటిజం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలపై అక్కడి సెలబ్రెటీలు చాలామంది అభ్యంతరం తెలిపారు. దీపికా పదుకొణెపై చేసిన ట్వీట్స్ వివాదానికి తెరలేపాయి. బాలీవుడ్ అంతా ఒకవైపు వెళుతుంటే.. కంగనా మాత్రం మరోవైపు వెళుతోందనే వాదనా ఉంది. ఇటీవల.. ముంబై నగరంపై కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.


ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తలపిస్తోందని కంగనా చేసిన కామెంట్ పెను దుమారమే రేపింది. ఈ వ్యాఖ్యలపై అధికార శివసేన తీవ్రంగా మండిపడింది. మహారాష్ట్ర, ముంబై, మరాఠాల గురించి మితిమీరి మాట్లాడితే సహించేది లేదని, తాను చేసిన వ్యాఖ్యలపై కంగనా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ముంబై పోలీసులపై నమ్మకం లేదని కంగనా చేసిన వ్యాఖ్యలకు కూడా సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ఇక్కడ అడుగుపెట్టవద్దని కంగనాకు సూచించారు.


కంగనా క్షమాపణ చెప్పకుంటే ముంబైలో అడుగుపెట్టనిచ్చేది లేదని ట్విట్టర్ వేదికగా శివసేన కార్యకర్తలు తెగేసి చెబుతున్నారు. అయితే.. ఈ విమర్శలకూ కంగనా కౌంటర్ ఇచ్చింది. తాను ఈ నెల 9న ముంబైకి వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో.. కంగనాకు ప్రాణ హాని ఉందని, ఆమె భద్రతపై సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ భద్రత కల్పించేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు కేంద్రం కూడా ఆమెకు వై ప్లస్ భద్రత కల్పించేందుకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలో.. కంగనా ముంబై పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2020-09-07T18:04:59+05:30 IST