బాలీవుడ్‌లో నెపోటిజానికి వీళ్లే కారణమంటూ...

ABN , First Publish Date - 2020-06-28T17:57:16+05:30 IST

బాలీవుడ్‌లో నెపోటిజానికి వీళ్లే కారణమంటూ...

బాలీవుడ్‌లో నెపోటిజానికి వీళ్లే కారణమంటూ...

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌... అర్థాంతరంగా నేల రాలిన వర్ధమాన హీరో. అతని ఆత్మహత్యతో ‘నెపోటిజం’ (బంధుప్రీతి) అనే పదం తెగ వైరల్‌ అయ్యింది. బాలీవుడ్‌లో బంధుప్రీతి ఎక్కువైందని, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని సామాన్యులను అక్కడ ఎదగనివ్వరని చాలామంది నెటిజన్ల అభిప్రాయం. సుశాంత్‌ ఆత్మహత్యకు స్టార్‌కిడ్సే కారణమంటూ వారి సోషల్‌ మీడియా ఖాతాలను అన్‌ఫాలో అవుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.. 


తెలిసిందా అలియా?


ప్రముఖ దర్శకుడు మహేష్‌ భట్‌ కూతురు అలియా. స్టార్‌ కిడ్‌ కావడంతో సినిమా అవకాశాలు సులువుగానే వచ్చాయి. మరో ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహార్‌ అండదండలూ పూర్తిగా ఉన్నాయి. నటన పరంగా మంచి మార్కులే పడడంతో సినిమాలు వరుసకట్టాయి. స్టార్‌డమ్‌ వచ్చిపడింది. సుశాంత్‌ ఆత్మహత్య తరువాత నెపోటిజంపై నిరసన సెగలు అలియానూ తాకాయి. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 13 లక్షల మంది అన్‌ఫాలో అయ్యారు. చాలా రోజుల క్రితం కరణ్‌ జోహార్‌ చేసిన ఓ ఇంటర్య్వూలో అలియా ‘సుశాంత్‌ ఎవరో తెలియద’ని చెప్పింది. అప్పటికే సుశాంత్‌ ధోనీ బయోపిక్‌తో పాటూ కొన్ని సినిమాల్లో నటించాడు. చాలా మందికి అభిమాన తారగా మారాడు. అయినా అలియా ‘సుశాంతా? అతనెవరు?’ అంటూ నవ్వింది. ఆనాటి ఆమె వీడియోను పదే పదే ప్రస్తావిస్తూ అలియాను తీవ్రంగా విమర్శిస్తున్నారు నెటిజన్లు. వారి బాధ పడలేక ఇన్‌స్టాలో ఇతరుల మెసేజ్‌లు తనకు చేరకుండా నిరోధించే ఆప్షన్‌ను ఎంచుకుంది అలియా.


కరీనా కకావికలం..

బాలీవుడ్‌లో కరీనా కుటుంబం పాతుకుపోయింది. తాతయ్యల దగ్గర మొదలైన వారి సినీ ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది. కరీనా ఇద్దరు తాతయ్యలు, తల్లితండ్రులు, అక్క కూడా నటులే. ఆమె సైఫ్‌ అలీఖాన్‌ను పెళ్లిచేసుకుంది. సైఫ్‌ కూతురు సారా అలీఖాన్‌ ‘కేదార్‌నాథ్‌’ సినిమాతో తెరంగేట్రం చేసింది. అయితే ఓ కార్యక్రమంలో కరీనా సారాతో మాట్లాడుతూ ‘నీ మొదటి సినిమా హీరోతో ఎప్పుడూ డేటింగ్‌కు వెళ్లకు’ అని చెప్పింది. సారా మొదటి హీరో ఎవరో కాదు.. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌. దీంతో సుశాంత్‌ ఆత్మన్యూనతకు కరీనా కూడా కారణమే కావచ్చంటూ నెటిజన్లు ఆమెను దూషించసాగారు. నెపోటిజంను పెంచి పోషించడంతో కరీనా తన వంతు బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తోందంటూ ఇన్‌స్టాలో మెసేజ్‌లు పంపసాగారు. దీంతో ఆమె తన ఖాతాకు మెసేజ్‌లు రాకుండా పూర్తిగా నిరోధించింది. అన్‌ ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా రోజురోజుకి పెరిగిపోతోంది.


సోనాక్షి ఖాతా గల్లంతు

బాలీవుడ్‌ నటుడు శతృఘ్న సిన్హా కూతురు సోనాక్షి. 90 కిలోలుండే సోనాక్షి బరువు తగ్గితే హీరోయిన్‌ ఛాన్స్‌ ఇస్తానని ప్రోత్సహించాడు సల్మాన్‌. సోనాక్షి బరువు తగ్గగానే ‘దబాంగ్‌’లో  అవకాశం ఇచ్చాడు. స్టార్‌కిడ్‌ కాబట్టి అంత సులువుగా పెద్ద సినిమాలో అవకాశం వచ్చింది. సుశాంత్‌లాంటి సామాన్యుల పరిస్థితి భిన్నం. ఒక్కోమెట్టు ఎక్కుతూ ఆకాశాన్ని అందుకోవాలి. సోనాక్షి అలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఛాన్స్‌ కొట్టేసింది.  ప్రస్తుతం నెపోటిజంపై జరుగుతున్న యుద్ధం.. తనని చేరేలోపే తన ట్విట్టర్‌ ఖాతాను డిజేబుల్‌ చేసేసింది సోనాక్షి. ఎలాంటి తిట్లదండకాలు తనని చేరకుండా అలా చేసినట్టు చెప్పింది. అంతేకాదు ‘తిట్టుకునేవాళ్లు ఎంతైనా తిట్టుకోండి. మీ శాపనార్థాలు నన్ను చేరవు. ఎంత ట్రోల్‌ చేస్తారో చేయండి.... అవేవీ నా వరకు రావని తెలుసుకోండి. చివరికి మీపై నేనే గెలిచా’ అని మెసేజ్‌ పెట్టి మరీ తన ట్విట్టర్‌ ఖాతాను తొలగించింది. సోనాక్షి తాను గెలిచానని అనుకుంటోంది... కానీ గెలిచింది నెటిజన్లే. పదేళ్లపాటూ సంపాదించుకున్న కోటి అరవై లక్షల మంది ఫాలోవర్లను చిటికెలో  తీసిపడేసేలా చేశారు. 


సోనమ్‌.. నీకో దండమ్‌

సుశాంత్‌ మరణంపై ‘ఎవరో మృతికి వారి బంధువులను, ప్రియురాళ్లను  కారణంగా చూపెట్టకండి’ అంటూ ట్వీట్‌ చేసింది సోనమ్‌ . ఆ ట్వీట్‌కు ‘నీ తండ్రి బాలీవుడ్‌లో లేకుంటే నువ్వెక్కడుండే దానివి?’ అంటూ తిట్ల దండకం మొదలైంది. సోనమ్‌ ‘తన తండ్రికి పుట్టడం తన అదృష్టమని.. ఎవరు ఏ ఇంట్లో పుట్టాలో ‘కర్మ’ నిర్ణయిస్తుందని’ మరలా ట్వీట్‌ చేసింది. ఆ ట్వీట్‌కు నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోశారు. కొన్నేళ్ల క్రితం కరణ్‌ జోహార్‌ షోలో  సుశాంత్‌ ఎవరో తనకు తెలియదని కామెంట్‌ చేసింది సోనమ్‌. సుశాంత్‌ను అందరూ కలిసే ఆత్మన్యూనతకు గురయ్యేలా చేశారని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సోనమ్‌ ఇన్‌స్టా, ట్విట్టర్‌లో మెసేజ్‌ సెక్షన్‌ను డిజేబుల్‌ చేసింది. 

Updated Date - 2020-06-28T17:57:16+05:30 IST