‘బసుదా’ ఇక లేరు!

ABN , First Publish Date - 2020-06-05T05:21:53+05:30 IST

బాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్‌లో ఇర్ఫాన్‌ ఖాన్‌, రిషీ కపూర్‌, మే నెల్లో గీత రచయిత యోగేశ్‌ గౌర్‌ కన్నుమూశారు. అలాగే కరోనాతో సంగీత దర్శకుడు వాజిద్‌ ఖాన్‌,...

‘బసుదా’ ఇక లేరు!

బాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్‌లో ఇర్ఫాన్‌ ఖాన్‌, రిషీ కపూర్‌, మే నెల్లో గీత రచయిత యోగేశ్‌ గౌర్‌ కన్నుమూశారు. అలాగే కరోనాతో సంగీత దర్శకుడు వాజిద్‌ ఖాన్‌, అనారోగ్యంతో గీత రచయిత అన్వర్‌ సాగర్‌ మరణించిన గంటల వ్యవధిలోనే సీనియర్‌ దర్శకుడు బసు ఛటర్జీ కూడా  కన్నుమూయడం... ఇలా వరుస మరణాలతో బాలీవుడ్‌ శోక సంద్రంలో మునిగిపోయింది. ‘బసుదా’ అని ఆత్మీయులంతా ఆప్యాయంగా పిలుచుకొనే 93 ఏళ్ల బసు అనారోగ్య కారణంగా గురువారం ముంబయ్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన చిత్రాల్లో మధురమైన గీతాలు ఎన్నో రాసిన గీత రచయిత యోగేశ్‌ గౌర్‌ మరణించిన ఆరు రోజులకే బసుదా మరణించడం విషాదకరం!


కార్టూనిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన బసు ఛటర్జీ 1969 వచ్చిన ‘సారా ఆకాశ్‌’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు.  మాస్‌ సినిమాలు, యాంగ్రీ యంగ్‌మన్‌లు  రాజ్యమేలుతున్న 1970ల దశకంలో మధ్యతరగతి కుటుంబ కథలతో, సామాన్యుడే హీరోగా బసు సినిమాలు తీసి ఓ ట్రెండ్‌ సృష్టించారు. అంతే కాదు ఆ నాటి సూపర్‌స్టార్స్‌ రాజేశ్‌ ఖన్నా, అమితాబ్‌, ధర్మేంద్రలతో కూడా ఆయన సినిమాలు రూపొందించారు. సగటు మనిషి తనని తాను తెరపై చూసుకొనే విధంగా బసు సినిమాలు ఉండడంతో అవన్నీ విజయం సాధించాయి. మనసును హత్తుకొనే సినిమాలు తీయడమే కాకుండా ఆణిముత్యాల్లాంటి ఆర్టిస్టుల్ని పరిశ్రమకు పరిచయం చేశారు. అమూల్‌ పాలేకర్‌, విద్యా సిన్హా, జరీనా వాహబ్‌ బసు చిత్రాల తోనే గుర్తింపు తెచ్చుకొన్నారు. అమూల్‌ పాలేకర్‌ బసు ఛటర్జీ తీసిన ఆరు చిత్రాల్లో హీరోగా నటించారు. అలాగే షబానా అజ్మీ కూడా మూడు సినిమాల్లో నటించారు. 


1969లో ‘సారా ఆకాశ్‌’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బసు ఛటర్జీ ‘రజనీగంధ’ (అమూల్‌ పాలేకర్‌, విద్యా సిన్హా), ‘ఛోటీ సీ బాత్‌’ (అమూల్‌ పాలేకర్‌, విద్యా సిన్హా), ‘చిత్‌ చోర్‌ (బెంగాలీ కథ ఆధారంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రంలో అమూల్‌ పాలేకర్‌, జరీనా వాహెబ్‌ జంటగా నటించారు. ఈ సినిమాతో ఉత్తమ గాయకునిగా ఏసుదాసు జాతీయ అవార్డు పొందారు), ‘ఖట్టా మీఠా’ (రాకేశ్‌ రోషన్‌, బిందియా గో స్వామి), ‘దిల్లగీ’ (ధర్మేంద్ర, హేమమాలిని), ‘మంజిల్‌ ’(అమితాబ్‌, మౌసమీ ఛటర్జీ), ‘చక్రవ్యూహ్‌’ (రాజేశ్‌ ఖన్నా, నీతూ సింగ్‌), ‘పియా కా ఘర్‌’, ‘ఉస్పార్‌’ వంటి ఉత్తమ చిత్రాలు రూపొందించారు. హిందీలోనే కాదు బెంగాలీలో కూడా ఆయన చిత్రాలు రూపొందించారు. ఆయన తొలి బెంగాలీ చిత్రం ‘హాతత్‌ బ్రిస్టీ’ కన్నడ హీరో ఉపేంద్ర సతీమణి ప్రియాంకకు హీరోయిన్‌గా తొలి సినిమా కావడం గమనార్హం. అలాగే దూరదర్శన్‌ కోసం  బ్యోమ్‌కేశ్‌ బక్షీ’, ‘రజనీ’ వంటి టీవీ సీరియల్స్‌ కూడా రూపొందించి, అక్కడ కూడా తనదైన ముద్ర వేసుకొన్నారు. ఫిల్మ్‌ సొసైటీ ఉద్యమానికి గట్టిగా మద్దతు పలికిన దర్శకుల్లో బసు ఒకరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు బసు ఛటర్జీ మృతికి సంతాపాలు తెలిపారు. 

Updated Date - 2020-06-05T05:21:53+05:30 IST