కరోనాకు వ్యాక్సిన్‌ రాదు..బాలకృష్ణ

ABN , First Publish Date - 2020-11-17T11:34:22+05:30 IST

‘‘ప్రకృతిని మనం అతిక్రమిస్తే... అది మనకు ఎలా సమాధానం చెబుతుందనేదానికి ఒక ఉదాహరణే ఈ కరోనా’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు

కరోనాకు వ్యాక్సిన్‌ రాదు..బాలకృష్ణ

‘‘ప్రకృతిని మనం అతిక్రమిస్తే... అది మనకు ఎలా సమాధానం చెబుతుందనేదానికి ఒక ఉదాహరణే ఈ కరోనా’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. కరోనాకి వ్యాక్సిన్‌ రాదని ఆయన చెప్పారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన ‘సెహరి’ ఫస్ట్‌లుక్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘భక్తి ఛానళ్లలో, ఆధ్మాతిక కార్యక్రమాల్లో ఉదయమే నిద్రలేచి చన్నీళ్లతో స్నానం చేయమంటారు. చస్తే... చేయవద్దు. నేను చెబుతున్నా... వాళ్లెవరి మాటలూ వినొద్దు. ఎందుకంటే... కరోనా అనేది నిమోనియాకు సంబంధించినది. ఇంతవరకూ దానికి వ్యాక్సిన్‌ రాలేదు. రాదు కూడా! దాని గురించి నాకు తెలుసు. కాబట్టి... ప్రతి ఒక్కరూ దయచేసి ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్య సూత్రాలు పాటించండి. వేడి వేడి నీళ్లతో స్నానం చేయండి. ఆవిరి పట్టండి. ఉప్పునీళ్లు లేదా వేడి నీళ్లతో నోటిని పుక్కిలించండి. జాగ్రత్తలు పాటిస్తే... అందరం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడప్పుడే కరోనా వెళ్లదు. పోవడానికి చాలా టైమ్‌ ఉంది. బహుశా... మన జీవితంలో కూడా ఇదొక భాగం అవుతుందేమో. దీంతో పాటే మనం బతకాలి’’ అన్నారు. ‘సి ఫర్‌ కరోనా.. సి ఫర్‌ క్యాన్సర్‌... ఇవాళ ఈ రెండే’ అని ఆయన అన్నారు. తనకు సినిమా ఎలాగో, క్యాన్సర్‌ ఆసుపత్రి కూడా అలాగే అనీ.... ప్రజాసేవ తన రక్తంలో ఉందనీ, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా సేవ చేస్తుంటానని ఆయన చెప్పారు.


‘సెహరి’ చిత్రదర్శకుడి పేరు జ్ఞానసాగర ద్వారక అని బాలకృష్ణ చెబుతూ... ‘‘ఇప్పుడు రామ అయోధ్య అయ్యింది. నెక్ట్స్‌ ద్వారక మీద బీజేపీ పడబోతోంది. సముద్రంలో కృష్ణుణ్ణి బయటకు తీయబోతున్నారు’’ అని అన్నారు.


సెహరి ఫస్ట్‌లుక్‌ విడుదల

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో అద్వయ జిష్ణురెడ్డి, శిల్పా చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సెహరి’. సోమవారం సినిమా ఫస్ట్‌లుక్‌ను బాలకృష్ణ ఆవిష్కరించారు. ‘‘మా స్నేహితుల జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది’’ అని హీరో హర్ష్‌ అన్నారు.

Updated Date - 2020-11-17T11:34:22+05:30 IST