బాజే... బ్యాండ్‌ బాజే

ABN , First Publish Date - 2020-09-16T07:00:23+05:30 IST

ఒకప్పుడు మనకు బ్యాండ్‌ కల్చర్‌ తక్కువనే చెప్పాలి. గత మూడేళ్లుగా ఈ కల్చర్‌ పెరిగింది. పార్టీలు, గెట్‌ టూగెదర్‌, ఎక్స్‌పో ఇనాగరేషన్స్‌, కార్పొరేట్‌ సంస్థల వార్షికోత్సవాలు...

బాజే... బ్యాండ్‌ బాజే

కొత్త ఎప్పుడూ వింతే! పాతను కొత్తగా చూపించేటప్పుడు అది అద్భుతం అవుతుంది. ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ అన్న తరహాలో పాత  బంగారం లాంటి పాటలకు కొత్త ఫ్లేవర్‌ని జోడించి ఈతరం సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి నేటి మ్యూజికల్‌ బ్యాండ్స్‌. నైట్‌ పార్టీస్‌, వివాహా వేడుకలు, కార్పొరేట్‌ ఈవెంట్లు... వేదిక ఏదైనా మధురమైన పాటలతో వీక్షకులను అలరించడమే ఈ బ్యాండ్స్‌ లక్ష్యం. హైదరాబాద్‌లో సందడి చేస్తున్న కొన్ని బ్యాండ్స్‌ సరిగమల సంగతులు ..


ఒకప్పుడు మనకు  బ్యాండ్‌ కల్చర్‌ తక్కువనే చెప్పాలి. గత మూడేళ్లుగా  ఈ కల్చర్‌ పెరిగింది. పార్టీలు, గెట్‌ టూగెదర్‌, ఎక్స్‌పో ఇనాగరేషన్స్‌, కార్పొరేట్‌ సంస్థల వార్షికోత్సవాలు...  ఇలా వేదిక ఏదైనా బ్యాండ్స్‌ సందడి  ఉండాల్సిందే!  అయితే  పెద్ద పెద్ద ఆర్కెష్ట్రాలు, పదుల సంఖ్యలో  సింగర్లు ఇక్కడ ఉండరు. సింపుల్‌గా ఐదారుగురితో  బ్యాండ్‌ని నడిపిస్తారు.  ఈ బ్యాండ్స్‌ నిర్వహించే వారంతా ఇంజనీరింగ్‌, డిగ్రీలు పూర్తి చేసినవారే కావడం గమనార్హం.      కొందరైతే  ఉద్యోగాలు  సైతం వదులుకుని బ్యాండ్స్‌ మీదే దృష్టి సారిస్తున్నారు. సినిమాల్లో పాడాలని కాకుండా కొత్తగా ఏదో చేయాలనే తపనతో వీరంతా  పనిచేస్తున్నారు. ప్రదర్శన ఇచ్చేది పబ్‌ అయినా, క్లబ్‌ అయినా ఆడియన్స్‌ను ఆకట్టుకొన్నప్పుడే  ఏ బ్యాండ్‌ అయినా సక్సెస్‌ అవుతుంది.  ప్రదర్శన నచ్చితేనే ఆడియన్స్‌ రెస్పాన్స్‌ బాగుంటుంది కనుక  వీక్షకుల్ని రాబట్టగలిగే సత్తా  బ్యాండ్‌లో ఉండాలి.  పాపులర్‌ అయిన పాటల్ని అలాగే పాడకుండా వాటికి  కొత్త వాయిద్యాల హంగులు అద్ది ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు అందించడం  బ్యాండ్లు చేయాల్సిన పని. చేస్తున్న  పని  కూడా! 

ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి

రెండు గంటల కార్యక్రమంలో ఒక సింగర్‌  ఒక్కోసారి 30 పాటలు పాడాల్సి ఉంటుంది. మధ్య మధ్య వీక్షకులు కోరిక మేరకు ఫేవరెట్‌ పాటలూ పాడాలి. వారాంతంలో నాలుగు గంటలపాటు పెర్‌ఫార్మ్‌ చేయాల్సి ఉంటుంది. ఒక్కో బ్యాండ్‌కి ఒక్కో శైలి ఉంటుంది.  బ్యాండ్స్‌ని ఇష్టపడే ప్రేక్షకులు ర్యాప్‌, వెస్ట్రన్‌ మ్యూజిక్‌ని కాకుండా అలనాటి పాత మెలోడీ పాటలను ఎక్కువగా కోరుకొంటున్నారు.  దానికి తగ్గట్టే బ్యాండ్‌ పాటల్ని సెలెక్ట్‌ చేసి పెర్‌ఫామ్‌ చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 బ్యాండ్స్‌ ఉన్నాయి. అందులో పాపులర్‌ అయిన వాటి సంఖ్య పదికి పైనే:. ముఖ్యంగా  త్రీయరీ బ్యాండ్‌, చౌరస్తా, క్యాప్రిసియో, అభేరి, మెరాకీ, జామర్స్‌, ద ప్లే మోర్స్‌, ద టేప్స్‌,  ఈగల్‌ రైడర్స్‌, మైక్రో టోన్‌ బ్యాండ్లు సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరిస్తున్నాయి.  ఐదు నుంచి ఎనిమిది మంది పని చేసే బ్యాండ్‌ను రిహార్సెల్స్‌, రికార్డింగ్‌, అప్‌డేట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా నడపాలంటే నెలకు  15 నుంచి 20 షోలు చేయాల్సిందే! కరోనా కాలంలో ఈవెంట్లు లేకపోవడంతో బ్యాండ్‌ టీమ్‌లన్నీ సొంతంగా లిరిక్స్‌ రాసి, బాణీలు కట్టి రానున్న రోజుల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. 


త్రీయరీ బ్యాండ్‌

ఇళయరాజా, ఎ.ఆర్‌.రెహమాన్‌ క్లాసిక్స్‌తోపాటు వాయిద్యాల్లో కొత్త శబ్దాలను క్రియేట్‌ చేసి అలరించడం ఈ బ్యాండ్‌ ప్రత్యేకత. 2013లో త్రీయరీ బ్యాండ్‌ ప్రారంభమైంది. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన దత్తసాయి, మార్క్‌తో కలిసి ఈ  బ్యాండ్‌ ప్రారంభించారు. ‘‘1998లో వయోలిన్‌ నేర్చుకోవడం మొదలుపెట్టా. కీరవాణి, తమన్‌ దగ్గర పనిచేశా. 2013లో ఇద్దరితో బ్యాండ్‌ మొదలు పెట్టాం. మొదట్లో ఇంగ్లిష్‌, హిందీ పాటల్ని పాడే వాళ్లం. ఇప్పుడు తెలుగు ఓల్డ్‌ హిట్‌ సాంగ్స్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఉన్న పాటల్ని రీ క్రియేట్‌ చేయడం కాకుండా మా టీమ్‌తో కొత్త పాటలు తయారు చేసి షోల్లో పెర్‌ఫార్మ్‌ చేయడం మా బ్యాండ్‌ ప్రత్యేకత. ఇన్‌స్ట్రుమెంట్స్‌ సౌండ్స్‌ని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తాం. మాస్‌ పాటల్ని పెద్దగా పెర్‌ఫామ్‌ చేయం. పబ్స్‌లో, క్లబ్స్‌లో ఇళయరాజా, ఎ.ఆర్‌.రెహమాన్‌ క్లాసికల్‌ సాంగ్స్‌తో అలరిస్తాం. అదే మా బ్యాండ్‌కు ప్లస్‌ అవుతోంది. ఇంజనీరింగ్‌ చేసి ఉద్యోగం వైపు  వెళ్లకుండా బ్యాండ్స్‌ వైపు రావడంతో  చాలా ఆనందంగా ఉన్నా.’’

దత్తసాయి 


చౌరస్తా బ్యాండ్‌

రెండేళ్ల క్రితం ప్రారంభమైన ‘చౌరస్తా’ బ్యాండ్‌ చేసిన ‘చేయి చేయి కలపకురా’ కరోనా కాలంలో ప్రజలు ఎలా ఉండాలనే సందేశాన్నిస్తే, ‘మిస్టర్‌ పెళ్లాం’ పాట కుటుంబ బాధ్యతలు మోసే అలుపెరగని స్త్రీమూర్తికి ఘన నివాళిగా నిలిచింది. జమైకా మ్యూజిక్‌ జానర్‌ ‘రేగే’ స్ఫూర్తితో పాశ్చాత్య సంగీతంలో జానపద శైలిలో ఈతరం ప్రేక్షకులు సైతం మెచ్చేలా పాటలు వినిపించడం ‘చౌరస్తా బ్యాండ్‌ ప్రత్యేకత. సామాజిక సమస్యలే ‘చౌరస్తా’ బృందం స్వరపరిచే పాటలకు ముడిసరుకు. మధ్యలో ‘మాయ’ అనే సరదా గీతాన్నీ వినిపించారు. ‘చేయి చేయి కలపకురా’కు రామ్‌ మిరియాల బాణీ కట్టడంతో పాటు ఆయనే స్వయంగా రాసి, పాడారు. ఆనంద్‌ గుర్రం రాసిన ‘మిస్టర్‌ పెళ్లాం’ పాటను యశ్వంత్‌ నాగ్‌ స్వరపరచడంతో పాటు ఆలపించారు. 


మెరాకీ బ్యాండ్‌ 

చిన్నప్పటి నుంచి సంగీతం మీదున్న ఆసక్తితో బ్యాండ్స్‌ వైపు వచ్చారు గణేశ్‌. మొదట వేరే బ్యాండ్స్‌లో పనిచేసి రెండేళ్ల క్రితం ‘మెరాకీ’ బ్యాండ్‌ ప్రారంభించారు. ‘‘మా బ్యాండ్‌లో డ్రమ్మర్‌, గిటారిస్ట్‌ రాక్‌ స్టైల్లో  ప్లే చేస్తారు. నేను సెమీ క్లాసికల్స్‌  పాడతాను. పాట పాతదే అయినా కొత్త ఫ్లేవర్‌లో పాడటం మా ప్రత్యేకత. అర్థరహిత పాటల్ని  నా బ్యాండ్‌లో పాడను. క్లాస్‌ బీట్స్‌ ఎక్కువగా ఉపయోగిస్తాం. ఆర్కెస్ట్రాలోలాగా  మా దగ్గర ఎక్కువ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఉండవు. పాట స్ట్రక్చర్స్‌ మార్చుతాం కాబట్టి టీమ్‌ అంతా కూర్చుని ప్రాక్టీస్‌ చేయాలి. బ్యాండ్స్‌కి, ఆర్కెస్ట్రాకు  పోలిక ఉండదు’’. 


అభేరి బ్యాండ్‌

సాయి కార్తీక్‌, అచ్చు వంటి సంగీత దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా పని చేసి ‘కారం దోశ’  చిత్రానికి సంగీతం అందించి, ప్లేబ్యాక్‌ సింగర్‌గా పనిచేసిన సిద్దార్థ్‌  బ్యాండ్‌ ట్రెండ్‌ను పసిగట్టి ఓ బ్యాండ్‌లో చేరారు. అక్కడ  కొన్ని రాజకీయాలను ఎదుర్కొని సొంతంగా  ‘అభేరి’ బ్యాండ్‌ను ప్రారంభించారు. ‘‘పబ్‌లకు  25 నుంచి 40లోపు వయసున్న వాళ్లు వస్తుంటారు. వాళ్లంతా ఇప్పటి పాటల్ని అంతగా ఇష్టపడడం లేదు. 90ల్లో వచ్చిన ఇళయరాజా పాటల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే వాటినే రీ క్రియేట్‌ చేస్తున్నాం. కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత కొత్త తరహా పాటలతో శ్రోతల్ని అలరించాలను కుంటున్నాం. లాక్‌డౌన్‌ సమయంలో ఒరిజినల్‌ కంటెంట్‌ మీద దృష్టి పెట్టి కొత్త పాటలు తయారు చేస్తున్నాం. భవిష్యత్‌లో సంగీత దర్శకుడిగా స్థిరపడాలని ఉంది’

సిద్ధార్ధ్‌జామర్స్‌ బ్యాండ్‌

‘‘14 ఏళ్ల  వయసు నుంచి సంగీతం నేర్చుకుంటున్నా. నేను చదివిన సీబీఐటీ కాలేజ్‌ బ్యాండ్‌లో పాడేవాణ్ణి. 2018లో ‘జామర్స్‌’ బ్యాండ్‌ ప్రారంభించా. అప్పటికే చాలా బ్యాండ్లు ఉన్నాయి. అయినా అందరికీ పని ఉంటోంది.  పబ్‌ల్లో డాన్స్‌ నంబర్స్‌, మాస్‌ సాంగ్స్‌ని అంతగా ఇష్టపడరు. మెలోడీ పాటల్ని ఎక్కువ ఇష్టపడతారు. అదే మాకు ప్లస్‌ అవుతోంది.  బ్యాండ్స్‌ పరిస్థితి పీక్స్‌లో ఉండగా కరోనా మహమ్మారి మొదలైంది. దానివల్ల లెక్కలన్నీ తారుమారయ్యాయి.’’

కృష్ణ తేజస్వీ 


Updated Date - 2020-09-16T07:00:23+05:30 IST