‘నానావతి’కి పబ్లిసిటీ ఇస్తున్నారంటూ మహిళ ఫైర్.. అమితాబ్ రిప్లై ఇదే!

ABN , First Publish Date - 2020-08-04T03:14:09+05:30 IST

బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్, అతడి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి ఇటీవలే కోలుకున్న విషయం తెలిసిందే. వీరందరికీ....

‘నానావతి’కి పబ్లిసిటీ ఇస్తున్నారంటూ మహిళ ఫైర్.. అమితాబ్ రిప్లై ఇదే!

ముంబై: బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్, అతడి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి ఇటీవలే కోలుకున్న విషయం తెలిసిందే. వీరందరికీ ముంబైలోని నానావతి ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. అయితే దీనిపై జాన్వీ మఖీజా అనే మహిళ అమితాబ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నానావతి ఆసుపత్రికి అమితాబ్ బచ్చన్‌‌ కావాలని పబ్లిసిటీ చేస్తున్నారని, ఆయనపై తనకున్న గౌరవం నేటితో పూర్తిగా పోయిందని ఆరోపించారు. ‘మా నాన్న గారికి కరోనా లేకపోయినా తప్పుడు రిపోర్టులతో ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ఆ తరువాత ఆయనను డిశ్చార్జ్ చేశాక మరో చోట యాంటీబాడీస్ టెస్ట్ చేయించాం. అందులో ఆయనకు కరోనా సోకనేలేదని తెలిసింది. నానావతి ఆసుపత్రిలో డబ్బుకు తప్ప ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రాధాన్యం ఉండదు. అలాంటి ఆసుపత్రికి మీరు కూడా ఈ స్థాయిలో పబ్లిసిటీ ఇస్తుండడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. మీపై ఇన్నాళ్లనుంచీ ఉన్న గౌరవం పూర్తిగా పోయింద’ని ఆమె ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. తాను ఎవరికీ పబ్లిసిటీ ఇవ్వలేదని, అయితే తన దృష్టిలో ఎప్పుడూ వైద్యులు ఉన్నత స్థానంలోనే ఉంటారని పేర్కొన్నారు.


‘వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వద్దకు వచ్చిన బాధితులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఏ ఆసుపత్రిలో కూడా బాధితుడికి చికిత్స అందించడాన్ని కూడా పబ్లిసిటీ చేసుకుంటారని నేననుకోవడం లేదు. అంతేకాదు ముఖ్యంగా నేను ఎవరికీ పబ్లిసిటీ ఇవ్వడం లేదు. మీకు నాపై ఉన్న గౌరవం పోయినప్పటికీ నేను మాత్రం ఎల్లప్పుడూ వైద్యులను గౌరవిస్తూనే ఉంటాను. అయితే మీ మీ నాన్నగారికి జరిగిన దానికి నేను చింతిస్తున్నానం’టూ అమితాబ్ వివరణ ఇచ్చారు.



Updated Date - 2020-08-04T03:14:09+05:30 IST