నా సినీ ఆయుర్దాయాన్ని పెంచిన పాట ఇది!

ABN , First Publish Date - 2020-12-18T05:16:24+05:30 IST

డబ్బింగ్‌ చిత్రాల పాటలనగానే- పెదాల కదలికలకు సరిపోయే పదాలు అల్లి వదిలేస్తారనే భావన కొందరిలో ఉంది. హీరో సూర్య నటించిన ‘ఆకాశమే హద్దురా’లో ‘కాటుక కనులే మెరిసిపోయే’ పాట వింటే - అలాంటి వారు కూడా తమ....

నా సినీ ఆయుర్దాయాన్ని పెంచిన పాట ఇది!

డబ్బింగ్‌ చిత్రాల పాటలనగానే-  పెదాల కదలికలకు సరిపోయే పదాలు అల్లి వదిలేస్తారనే భావన కొందరిలో ఉంది. హీరో సూర్య నటించిన ‘ఆకాశమే హద్దురా’లో ‘కాటుక కనులే మెరిసిపోయే’ పాట వింటే - అలాంటి వారు కూడా తమ అభిప్రాయాన్ని మార్చుకోకతప్పదు. అచ్చమైన తెలుగు సినిమాకు రాసిన గీతంలా అనిపించే ఈ పాటను సరళమైన, వాడుక భాషలో రక్తి కట్టించారు సుప్రసిద్ధ గీత రచయిత భాస్కరభట్ల. ఇంతకీ ఈ ‘కాటుక కనులు’ ఎందుకంతలా ‘మెరిశాయి’..! యూట్యూబ్‌లో కోట్ల మందిని ఎందుకు మెప్పించాయి..! అనే విశేషాలు భాస్కరభట్ల మాటల్లోనే... 


ఆ పాట కవి నోట (రచయిత: భాస్కర భట్ల/ సంగీతం: జీవీ ప్రకాష్‌) 


గతంలో నేను... సుధ కొంగర గారి దర్శకత్వంలో వచ్చిన ‘గురు’ చిత్రానికి రెండు పాటలు రాశాను. రెండూ మాస్‌ సాంగ్సే. ఆ పరిచయంతోనే ‘ఆకాశమే హద్దురా’కు కూడా రాయమని ఆమె కోరారు. ‘మాస్‌ సాంగా’ అని అడిగాను. ‘అవును. అవైతే మీరు బాగా రాస్తారు కదా’ అన్నారు. ‘మాస్‌ పాటలు చాలా రాశాను. నాకు మెలోడీలు రాయాలని ఉంది. అవి ఉంటే ఇవ్వండి’ అని  అడిగాను. ‘మాస్‌ సాంగ్‌ అయితే ట్యూన్‌ రెడీగా ఉంది. మెలోడీ కావాలంటే నాలుగైదు రోజులు ఆగి పంపిస్తాను’ అన్నారు. ‘కాస్త లేటైనా పర్లేద’ని బదులిచ్చాను. అలా ‘కాటుక కనులే మెరిసిపోయే’ పాట రాయమని నాకు పంపించారు.


అది అప్పటికే తమిళ్‌లో రికార్డ్‌ చేశారు. విజువల్‌ నాకు వీడియోకాల్‌లో చూపించారు. సందర్భం ఏమిటో ఆమె స్పష్టంగా చెప్పారు. ‘చాలా కాలం దూరమైపోయిన కథానాయకుడు తిరిగి వస్తాడు. కథానాయిక మాత్రం దూరమైనన్ని రోజులూ అతడినే తలుచుకొంటూ ఉండిపోతుంది. అన్నాళ్ల తరువాత అతడు కనిపించగానే వచ్చే ఆనందం, చిన్న అలక, ప్రేమ, విరహం... ఆ భావాలన్నీ పాటలో ఉండాలి. ఇద్దరి మధ్యా అనుబంధాన్ని చూపించగలగాలి’ అని సుధ గారు వివరించారు. దీంతో నాకూ ఒక స్పష్టత వచ్చింది. 


తమిళ్‌లో ‘కాటు పైలే’ అని మొదలవుతుంది. నాకు దాని అర్థం కూడా తెలియదు. అర్థం తెలుసుకోకుండా రాసినప్పుడే మనం ఆ సందర్భాన్ని ఊహించుకొని, మన భాషలో, మన ప్రాంతానికి దగ్గరగా రాయగలుగుతాం. అంటే మనం ఎలా కావాలనుకున్నామో అలా స్పందించడానికి వీలుంటుంది. అలాకాకుండా మాతృకలో ఉన్న పాట అర్థం తెలుసుకుని రాస్తే... మనసంతా దాని చుట్టూనే తిరుగుతుంటుంది. అందుకే నేను ఆ విజువల్‌, సందర్భం మాత్రమే గుర్తు పెట్టుకున్నాను. తనను ప్రేమించినవాడు చాలా కాలం తరువాత  కలిస్తే ఒక అమ్మాయి అనుభూతి ఎలా ఉంటుంది? ఇదే పాటలో పెళ్లి కూడా అయిపోవాలి. అంటే ఒక అమ్మాయిగా మొదలుపెట్టి... ప్రేమ, పెళ్లి దాకా చూపించాలి. అందులో అమ్మాయి మనసు ఒక్కటే కాకుండా, పెళ్లి అయ్యాక ఇద్దరి మధ్యనుండే సాన్నిహిత్యాన్ని కూడా రాయాలని ప్రయత్నించాను. అందుకే చూడండి... 


నీ పిచ్చి పట్టుకుందిరా... వదిలిపెట్టనందిరా 

నిన్ను గుచ్చుకుంటా ఆఆ నల్లపూసలాగా 

అంటిపెట్టుకుంటా ఆఆ వెన్నుపూసలాగా 

...అని రెండో చరణంలో రాయడానికి కారణం అదే! పెళ్లయ్యాక వ్యక్తపరిచే భావాలు, భాష ఎలా ఉంటే బాగుంటుందో ఆలోచించి, అలా రాశాను. అలాగే ‘కాటు పైలే’ సౌండింగ్‌ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కు బాగా నచ్చినట్టుంది. కనుక అదే సౌండింగ్‌లో ఉండాలని... ‘కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి’ అన్నాను. ఎంతో కాలం తరువాత కనపడిన ప్రియుడిని చూసినప్పుడు ‘నల్లగా ఉన్న కాటుక కళ్లు కూడా మెరిసిపోయాయి’ అనే భావంతో రాశాను. కాటుక పూసిన కళ్లు నల్లగా ఉంటాయి. కానీ అక్కడ కూడా మెరిసిపోయే లక్షణం కనిపించింది. అలాగే ‘మాటలన్నీ మరిచిపోయా... నీళ్లే నమిలేసి’! ఏదైనా ఆశ్చర్యంలోనో, దిగ్ర్భాంతిలోనో ఉన్నప్పుడు మాటల కోసం తడుముకొంటాం. దాన్నే ‘నీళ్లు నమలడం’ అంటాం. ఆ వాడుక పదాన్ని ప్రస్తుత తరం వారు దాదాపు మరిచిపోయారు. దాన్ని మళ్లీ గుర్తు చేశాను. పదాలన్నీ సరళంగా, రోజూ మాట్లాడుకొనేలా ఉంటాయి. అందుకే అంతమందికి చేరువైందనుకుంటున్నా. అదే కోవలో... 


ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు 

గుండెకెంత సందడొచ్చెరా... 

...గుండెకు సందడి వచ్చిందని చెప్పడం మామూలే. అయితే ఆ అమ్మాయి ఎంత ఆనందంగా ఉందన్నది చెప్పడంలోనే మనమేమన్నా కవిత్వం చూపించగలగాలి. సందడి ఎలా వచ్చిందంటే... ‘ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు’! నీకు స్వాగతం పలుకుతున్నానన్న భావం. 


వేప చెట్టు ఆకులన్ని గుమ్మరించినట్టు 

ఈడుకేమో జాతరొచ్చెరా... 

...జాతరొచ్చినప్పుడు, అందులో అమ్మోరు పూనినప్పుడు వేపాకులతో శాంతింపజేస్తారు. అంతా జాతరలా, శివాలెత్తారంటారు కదా! అంత ఆనందం అన్నమాట. 


నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా 

రాతిరంత నిదరపోని అల్లరే నీదిరా... 

నా చిన్నప్పుడు అమ్మ కొంగు ముడి విప్పి, దాచుకున్న చిల్లర తీసుకువెళ్లిపోయేవాడిని. ఇటువంటి చిలిపి అనుభవాలు ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. ఈ పాట విని ఆ అనుభవం ఉన్నవాళ్లు గుర్తు తెచ్చుకొంటారు. లేనివాళ్లు ఊహించుకోగలుగుతారు. తరువాత ‘నా మనసే నీ వెనకే తిరిగినది... నీ మనసే నాకిమ్మని అడిగినది’... ఇలా సింపుల్‌ ఎక్స్‌ప్రెషన్‌లో అపారమైన ప్రేమను వెలిబుచ్చడం. ‘గోపురాన వాలివున్న పావురాయిలా... ఎంత ఎదురుచూసినానో అన్ని దిక్కులా’... అంటే గోపురం మీద వాలిన పావురం అన్ని దిక్కులా చూడగలుగుతుంది. ‘నువ్వు వచ్చినట్టు ఏదో అలికిడవ్వగా... చిట్టి గుండె గంతులేసె చెవుల పిల్లిలా’... ఇక్కడ చెవుల పిల్లి అన్నా కుందేలన్నా ఒకటే. ఈ పదాన్ని ఎవరూ వాడరు. అదేవిధంగా ‘నా నుదిటి మీద వెచ్చగా... ముద్దు బొట్టు పెట్టరా’ కూడా! ‘ముద్దు బొట్టు’ అన్నది కొత్త భావం. ఈ పద ప్రయోగం నాకు బాగా నచ్చింది. 


నా చేతివేళ్ల మెటికలు... విరుచుకోర మెల్లిగా 

చీరకున్న మడతలే చక్కబెట్టరా... 

...శృతి మించకుండా శృంగార రసాన్ని కూడా పాటలో పేర్చాను. ఎక్కడా ద్వందార్థాలు లేకుండా రాశాను. చిన్న రొమాన్స్‌ ఉంటుంది తప్పితే ఎక్కడా బూతు ఉండదు. జీవీ ప్రకాష్‌ శ్రావ్యమైన బాణీ, గాయని ధీ గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. ముఖ్యంగా డబ్బింగ్‌ పాటకు ఇంత ఆదరణ రావడం, అదీ సాహిత్యం గురించి మాట్లాడుకోవడం గొప్ప విషయం. డబ్బింగ్‌ పాటల్లో నాకు స్ఫూర్తి రాజశ్రీ గారు. ‘ప్రేమికుడు’ చిత్రంలో ఆయన రాసిన ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’ పాట నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌. ఇది ఒక తెలుగు పాటలానే ఉంటుంది. నాకు తెలిసి మళ్లీ ఆ స్థాయిలో కుదిరిన పాట ‘కాటుక కనులే మెరిసిపోయే’. రచయితగా ఇది నా ఆయుర్దాయాన్ని పెంచింది. 


ఇరవై ఏళ్ల స్పెషల్‌...  

నా సినీ ప్రస్థానం 2000లో ప్రారంభమైంది. విచిత్రమేమంటే సరిగ్గా నా ఇరవై ఏళ్ల కెరీర్‌ పూర్తయినప్పుడు, అంటే ఈ ఏడాది జూలైలో ఈ పాట విడుదలైంది. ఘన విజయం సాఽధించింది. స్ట్రయిట్‌ పాటకు వచ్చినంత ఆదరాభిమానాలు లభించాయి. అందుకే నాకిది ప్రత్యేకమైన పాట. ఇప్పటి వరకు రెండు వేలకు పైగా పాటలు రాశాను. ఇక శ్రీశ్రీ, తిలక్‌ల సాహిత్యం బాగా ఇష్టం. పరిశ్రమలోకి రాకముందు వారి రచనలే చదివేవాడిని. సినిమాల్లో అయితే వేటూరి గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నాకు స్ఫూర్తి. అలాగే కన్నడ డబ్బింగ్‌ చిత్రం ‘పొగరు’లో ‘కరాబు’ పాట కూడా నేనే రాశాను. దానికీ వీక్షకుల సంఖ్య 46 మిలియన్లు దాటిపోయింది. రచయితగా ఈ విజయాలు ఎంతో సంతృప్తినిచ్చాయి.  

Updated Date - 2020-12-18T05:16:24+05:30 IST