ట్విట్టర్‌లోనూ వీళ్లదే హవా!
ABN , First Publish Date - 2020-12-15T10:38:22+05:30 IST
సినిమాకు సంబంధించిన ఏ పనైనా సందడిగానే సాగుతుంది. ప్రారంభం నుంచి ప్రింటు థియేటర్‌కు వెళ్లే వరకూ ప్రతి దశలోనూ సందడి తప్పనిసరి....

సినిమాకు సంబంధించిన ఏ పనైనా సందడిగానే సాగుతుంది. ప్రారంభం నుంచి ప్రింటు (ఇప్పుడంతా డిజిటల్ మయం కనుక కంటెంట్) థియేటర్‌కు వెళ్లే వరకూ ప్రతి దశలోనూ సందడి తప్పనిసరి. షూటింగ్ పూర్తయ్యాక సినిమా ప్రమోషన్‌మీదే దృష్టి పెడుతుంటారు దర్శకనిర్మాతలు. టీజర్, ట్రైలర్ విడుదల దగ్గర్నుంచి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ,,,, ఇలా ప్రతి దశలోనూ ఆ సినిమాలో నటించిన తారలు ప్రమోషన్ యాక్టివిటీస్‌లో పాల్గొంటుంటారు. ఇక సినిమా విడుదలయ్యాక సక్సెస్‌మీట్లు, విజయయాత్రలు కూడా ఉంటుంటాయి.
అయితే ఈ ఏడాది మాత్రం సినిమా వాళ్లకు భిన్నంగా గడిచిందని చెప్పాలి. ఎందుకంటే కరోనా వల్ల షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. సినిమా హాళ్లు మూతపడ్డాయి. కొన్ని సినిమాలు డిజిటల్ వైపు వెళ్లాయి. జనంలోకి వెళ్లి సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు లేకపోవడంతో చిత్రపరిశ్రమ సోషల్ మీడియా మీద దృష్టి పెట్టింది. అభిమాన తారల సినిమా గురించి, తాజా వార్తల కోసం సామాజిక మాఽధ్యమాల్లో వరుసగా పోస్టులు పెట్టారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ను పరిశ్రమ ఎక్కువగా ఉపయోగించుకొంది. ఈ సంవత్సరం సౌత్ సినిమాకు సంబంధించి ట్విటర్‌లో నెటిజన్లు ఎక్కువగా ట్వీట్లు చేసిన చిత్రాల జాబితాను ట్విట్టర్ ఇండియా సంస్థ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలివి..
‘మాస్టర్’ నంబర్ 1
తమిళస్టార్ విజయ్ హీరోగా యాక్షన్ కథాంశంతో లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహించిన ‘మాస్టర్’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకున్నారు. అయితే కరోనా, లాక్‌డౌన్ వల్ల వాయిదా పడింది. ఓటీటీలో విడుదల చేయాలనుకున్నా కార్యరూపం దాల్చలేదు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అభిమానులు చేసిన ట్వీట్లు ఈ సినిమా ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంచాయి.
రెండో స్థానంలో ‘వకీల్‌సాబ్’
మూడేళ్ల విరామం తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. హిందీ ‘పింక్’కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘వకీల్‌సాబ్’ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ‘మగువ’ పాట వరకూ ప్రతి విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. ట్విట్టర్‌లో అత్యధికంగా ట్వీట్‌లు చేసిన రెండో సినిమాగా వకీల్‌సాబ్ నిలిచింది.
మూడో స్థానంలో ‘వలిమై’.
అజిత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘వలిమై’ సినిమాకు సంబంధించిన సమాచారం కూడా ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది. . ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్‌డేట్స్ పెడుతూ అజిత్ , వలిమై హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు.
నాలుగో స్థానంలో ‘సర్కార్ వారిపాట’
షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే సోషల్ మీడియాలో సందడి చేస్తున్న చిత్రం మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’. మహేశ్‌కు ట్విట్టర్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన ఈ చిత్రం గురించి అభిమానులు తరచూ ట్విట్టర్‌లో ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అలా అధికంగా ట్వీట్లు చేసినచిత్రంగా నాలుగో స్థానంలో ఉంది.
సూర్య హీరోగా ఇటీవల విడుదలై విజయవంతమైన ‘ఆకాశం నీ హద్దురా’ కూడా ప్రేక్షకుల్ని అలరించింది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ సినిమా ట్విట్టర్ ఫాలోయింగ్‌లో ఐదో స్థానంలో ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి సంబంధించిన ఏ వార్తయిన సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. హీరోల లుక్‌ల నుంచి హీరోయిన్ల ఆగమనం వరకూ ప్రతీది ఓ ట్రెండే ఈ సినిమాకు సంబంధించి కూడా ట్విట్టర్‌లో చర్చ ఎక్కువగా ఉంటుంది. అలా ఈ సినిమా ఆరో స్థానంలో ఉంది. అల్లు అర్జున్ ‘పుష్ఫ’ ఏడో స్థానంలో ఉండగా, విడుదలై విజయవంతమైన సరిలేరు నీకెవ్వరు’ ఎనిమిదో స్థానం సొంతం చేసుకుంది. కన్నడ చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ 9వ స్థానంలో ఉండగా, రజనీకాంత్ ‘దర్బార్’ పదో స్థానంలో ఉంది.
Read more