సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
ABN, First Publish Date - 2021-01-01T02:51:14+05:30
ప్రముఖ తెలుగు సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్, సోమజిగూడా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొంతకాలంగా
ప్రముఖ తెలుగు సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్, సోమజిగూడా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయనకు డయాలిసిస్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. నర్సింగ్ యాదవ్ అనేక తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు, కమెడియన్ విలన్ పాత్రలు, విలక్షణ పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఆయన పూర్తి పేరు మైలా నరసింహ యాదవ్. ఇండస్ట్రీలో అందరూ ఆయనని నర్సింగ్ యాదవ్ అని పిలుస్తారు. 1963 మే 15న హైదరాబాద్‌లో జన్మించిన ఆయనకు భార్య (చిత్ర), కొడుకు (రిత్విక్ యాదవ్) ఉన్నారు.
తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో దాదాపు 300లకు పైగా చిత్రాలలో ఆయన నటించారు. విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన ‘ప్రజల మనిషి‘, 'హేమాహేమీలు' చిత్రాలతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రజినీకాంత్ 'భాష', చిరంజీవి 'శంకర్ దాదా ఎంబీబీయస్' వంటి చిత్రాలతో పాటు.. క్షణక్షణం, మాస్, గాయం, సుడిగాడు, కిక్ వంటి పలు చిత్రాలలో ఆయన నటించారు. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీనెంబర్ 150లోనూ ఆయన ఓ పాత్ర చేశారు. నర్సింగ్ యాదవ్ మరణ వార్త విన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.