నిజమైన సూపర్‌ హీరో

ABN , First Publish Date - 2020-08-31T05:58:24+05:30 IST

ఆస్కార్‌ చరిత్రలో ఉత్తమ చిత్రం విభాగంలో నామినేట్‌ అయిన తొలి సూపర్‌ హీరో సినిమా ‘బ్లాక్‌ పాంథర్‌’. అంతే కాదు... 1.347 బిలియర్‌ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 9,850 కోట్లు) వసూలు చేసింది...

నిజమైన సూపర్‌ హీరో

‘బ్లాక్‌ పాంథర్‌2 గురించి’?

ఓ కార్యక్రమంలో విలేకరి ప్రశ్న!

‘అయామ్‌ డెడ్‌!’ (నేను మరణించాను)

చాడ్విక్‌ బోస్‌మన్‌ చెప్పిన సమాధానమిది!!

అవును... ఇప్పుడు చాడ్విక్‌ లేరు. మరణించారు.

కానీ, అతను పంచిన స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుంది.

నిజ జీవితంలోనూ చాడ్విక్‌ బోస్‌మన్‌ సూపర్‌ హీరో!


ఆస్కార్‌ చరిత్రలో ఉత్తమ చిత్రం విభాగంలో నామినేట్‌ అయిన తొలి సూపర్‌ హీరో సినిమా ‘బ్లాక్‌ పాంథర్‌’. అంతే కాదు... 1.347 బిలియర్‌ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 9,850 కోట్లు) వసూలు చేసింది. ఆ సినిమా ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకులకు చాడ్విక్‌ బోస్‌మన్‌ గుర్తొస్తారు. మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ (ఎంసీయు)లో రాజు (కింగ్‌ ఛలా)గా అతని నటన గుర్తొస్తుంది. ‘బ్లాక్‌ పాంథర్‌’ అంటే చాడ్విక్‌... అంతే! మరి, చాడ్విక్‌ బోస్‌మన్‌ అంటే? బ్లాక్‌ పాంథర్‌ ఒక్కటేనా?? కానే కాదు! అంతకు మించి!!


గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు. కాదు కాదు... సాయం చేశాడు. క్యాన్సర్‌ చిక్సితలో శరీరానికి అయ్యే గాయాలు ఆ విలువను చెప్పాయేమో! తనకు క్యాన్సర్‌ అని ప్రపంచానికి చాడ్విక్‌ బోస్‌మన్‌ చెప్పలేదు. రహస్యంగా ఉంచారు. కానీ, రెండేళ్ల క్రితం క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలలకు సహాయం అందించారు. అమెరికాలోని ఓ ఆస్పత్రిలో క్యాన్సర్‌ చికిత్స పొందుతున్న చిన్నారులను కలిసి ఆటబొమ్మలు అందించి వాళ్లలో ఆనందాన్ని, ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారు. క్యాన్సర్‌ చికిత్స వల్ల బరువు తగ్గినప్పుడు పలువురు బాడీ షేమింగ్‌ చేసినా... పల్లెత్తు మాట అనలేదు. అదీ చాడ్విక్‌ బోస్‌మన్‌ వ్యక్తిత్వం! ప్రవర్తనతో మౌనంగా ఎదగమని సందేశాన్నిచ్చారు.


వర్ణవివక్ష, జాత్యహంకారం వంటివి హృదయానికి తగిలే గాయాలు. అవి బయటకు కనిపించవు! బహుశా... చాడ్విక్‌ బోస్‌మన్‌కి అటువంటి గాయం ఎప్పుడో అయ్యి ఉంటుంది. అందువల్లే, లెజెండరీ ఆఫ్రో-అమెరికన్ల జీవితాలను వెండితెరపైకి తీసుకొచ్చాడేమో! ‘బ్లాక్‌ పాంథర్‌’ కంటే ముందు ‘42’, ‘గెట్‌ ఆన్‌ అప్‌’, ‘గాడ్స్‌ ఆఫ్‌ ఈజిప్ట్‌’, ‘మెసేజ్‌ ఫ్రమ్‌ ద కింగ్‌’, ‘మార్షల్‌’ చిత్రాల్లో చాడ్విక్‌ బోస్‌మన్‌ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అసలు, ఆయన ప్రయాణమే ఓ స్ఫూర్తి పాఠం!


బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (దర్శకత్వం)లో చాడ్విక్‌ డిగ్రీ పట్టా అందుకున్నారు. అప్పట్లో ఆయన రచన, దర్శకత్వం చేయాలనుకున్నారు. హైస్కూల్‌లో ఉన్నప్పుడు సహ విద్యార్థిని కాల్చి చంపిన ఘటనపై ‘క్రాస్‌రోడ్స్‌’ అని  ఓ నాటిక రాశారు. నటుడు అవ్వాలని నిర్ణయించుకుని లాస్‌ ఏంజిల్స్‌కి రాకముందు బ్రూక్లిన్‌లో డ్రామా ఇన్‌స్ట్రక్టర్‌గా ఉద్యోగం చేశారు. ఐదేళ్లు బుల్లితెరపై చిన్న పాత్రలు చేసిన తర్వాత ‘ద ఎక్స్‌ప్రెస్‌: ద ఎర్ని డెవిస్‌ స్టోరీ’తో వెండితెరపైకి వచ్చారు. మధ్యలో నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే నాటకాలు రాసే అలవాటును కొనసాగించారు. అలాగని, వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించలేదు. తనకు నచ్చిన నటీనటులతో పనిచేసే అవకాశం లభించినా, పాత్రలు నచ్చని కారణంగా ‘నో’ చెప్పారు. ‘‘కొన్ని సందర్భాల్లో కొన్నిటికి నో చెప్పడం వల్లే ఈ రోజు నేనీ స్థాయికి చేరుకోగలిగాను’’ అని చాడ్విక్‌ ఓ సందర్భంలో అన్నారు. 


తొలి చిత్రం తర్వాత నటుడిగా ఆశించిన రీతిలో అవకాశాలు రాకపోవడంతో నటనకు స్వస్తి పలికి... దర్శకత్వం మీద దృష్టి సారించాలనుకున్నారు. అప్పుడు... 2013లో వచ్చిన ‘42’ చాడ్విక్‌ బోస్‌మన్‌ జీవిత గమనాన్ని మలుపు తిప్పింది. బేస్‌బాల్‌ దిగ్గజం జాకీ రాబిన్‌సన్‌గా ‘42’లో చాడ్విక్‌ నటించారు. జాకీ నల్ల జాతీయుడు. ఆ తర్వాత తనలోని నటుణ్ణి, వ్యక్తిని సంతృప్తి పరిచే పాత్రల కోసం అన్వేషణ సాగించాడు. నల్లజాతీయుల గౌరవాన్ని వెండితెరపైకి తీసుకొచ్చారు. ‘గెట్‌ ఆన్‌ అప్‌’లో జేమ్స్‌ బ్రౌన్‌గా, ‘మార్షల్‌’లో థర్‌గుడ్‌ మార్షల్‌గా గ్రేట్‌ ఐకానిక్‌ బ్లాక్‌ పీపుల్స్‌ పాత్రలకు ప్రాణం పోశాడు. చాడ్విక్‌ ఎప్పుడూ ప్రేమకథల్లో నటించలేదు. వ్యవస్థ, వర్ణ వివక్ష, అవినీతి, చెడు లేదా చెడ్డ వ్యక్తుల మీద పోరాటం చేసే వ్యక్తిగా నటించారు. అదే అతణ్ణి ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. నల్ల జాతీ యులు సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. ‘ఎంసియు’లో బ్లాక్‌ పాంథర్‌ పాత్ర ప్రపంచ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.


‘బ్లాక్‌ పాంథర్‌’ ఓ సూపర్‌ హీరో కథను మాత్రమే చెప్పలేదు. ఆఫ్రికన్‌ అమెరికన్ల పౌరహక్కులపై సందేశమూ ఇచ్చింది. వాళ్ల గౌరవాన్ని, బలాన్ని, మానవ త్వాన్ని చూపింది. శక్తిమంతమైన, తెలివైన మహిళలను చూసి ‘బ్లాక్‌ పాంథర్‌’లో కింగ్‌ భయపడలేదు. వాళ్లకు జీవితాన్ని, నాయకత్వాన్ని అంకితమిచ్చాడు. మహిళలను చిన్నచూపు చూసేవాళ్లకు ఇదీ ఓ గొప్ప సందేశమే. అన్నిటికంటే ముఖ్యంగా ఆఫ్రో-అమెరికన్‌ బాలల్లో ‘బ్లాక్‌ పాంథర్‌’ ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఆ సినిమా తర్వాత తమను తాము సూపర్‌ హీరోగా ఊహించుకునే బాలలు కనిపించారు. బ్లాక్‌ పాంథర్‌ సూట్‌లో సందడి చేశారు. అదీ చాడ్విక్‌ బోస్‌మన్‌ నల్ల జాతీయులకు ఇచ్చిన భరోసా. వాళ్లకు అతడో ఆశాకిరణం, గౌరవ చిహ్నం. 


‘బ్లాక్‌ పాంథర్‌ 2’ చేయకుండానే చాడ్విక్‌ కన్నుమూశారు. కానీ, అతను అందించిన స్ఫూర్తి ఎప్పటికీ కనుమరుగు కాదు. భావితరాలకు అతడు అందించిన నల్ల జాతీయుల కథలు కనుమరుగు కావు. సామాజిక మాధ్యమాల సాక్షిగా వ్యర్ణవివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసం అతను సాగించిన పోరాటం, ఇతరుల్లో నింపిన పోరాటస్ఫూర్తి కనుమరుగు కాదు. క్యాన్సర్‌ వచ్చిన తర్వాత 10 చిత్రాల్లో నటించారు. అన్నీ యాక్షన్‌ చిత్రాలే. అవన్నీ శారీరక శ్రమతో కూడుకున్నవే. ప్రేక్షకులకు ఆనందం అందించడం కోసం అంత కష్టపడిన హీరోని మర్చిపోగలమా? వుయ్‌ మిస్‌ యు రియల్‌ లైఫ్‌ సూపర్‌ హీరో.


గతేడాది అక్టోబర్‌లో గాయని టేలర్‌ సిమాన్‌ లెడ్‌వర్డ్‌తో చాడ్విక్‌ బోస్‌మన్‌ నిశ్చితార్థం జరిగింది. కొన్ని నెలల క్రితం వాళ్లిద్దరి వివాహం జరిగింది. చాడ్విక్‌ మరణించే సమయంలో టేలర్‌ అతని పక్కనే ఉంది.


‘చిత్రజ్యోతి’లో మరిన్ని ఆసక్తికర కథనాల కోసం 

ఈ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.

లేదా ఈ క్రింది యూఆర్‌ఎల్‌https://qrgo.page.link/C8gTmలో చదవండి.

Updated Date - 2020-08-31T05:58:24+05:30 IST