30 వ‌సంతాల ‘క‌ర్త‌వ్యం’

ABN , First Publish Date - 2020-06-29T14:26:51+05:30 IST

1990 జూన్ 29.న విడుద‌లైన ఓ సినిమా తెలుగు చ‌ల‌న చిత్ర సీమ‌కు స‌రికొత్త స్టార్ ప‌రిచ‌యం చేసింది. ఆ స్టార్ ఎవ‌రో కాదు విజ‌య‌శాంతి. సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ వైజ‌యంతీగా విజ‌య‌శాంతి బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తాను చాటారు. లేడీ అమితాబ్ అనే ఇమేజ్‌ను ఆమెకు క‌ట్టిన బెట్టిన ఆ చిత్ర‌మే ‘క‌ర్త‌వ్యం’. నేటికి సినిమా విడుద‌లైన 30 వ‌సంతాల‌వుతుంది.

30 వ‌సంతాల ‘క‌ర్త‌వ్యం’

1990 జూన్ 29న విడుద‌లైన ఓ సినిమా తెలుగు చ‌ల‌న చిత్ర సీమ‌కు స‌రికొత్త సూపర్‌స్టార్‌ని ప‌రిచ‌యం చేసింది. ఆ స్టార్ ఎవ‌రో కాదు విజ‌య‌శాంతి.  సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ వైజ‌యంతీగా విజ‌య‌శాంతి బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తాను చాటారు. లేడీ అమితాబ్ అనే ఇమేజ్‌ను ఆమెకు క‌ట్టిన బెట్టిన ఆ చిత్ర‌మే ‘క‌ర్త‌వ్యం’. నేటికి సినిమా విడుద‌లై 30 వ‌సంతాల‌వుతుంది. 


కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌లకు చెల్లెలుగా నటించిన విజయశాంతి ఆ తర్వాత తరం స్టార్ హీరోలైన  కృష్ణ‌, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో పాటు త‌ర్వాత త‌రం అగ్ర క‌థానాయ‌కులు చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్, మోహన్‌బాబు.. ఇలా అంద‌రితో జోడీ క‌ట్టారు. అయితే ఆమెను న‌టిగా మ‌రో కోణంలో ఆవిష్క‌రించింది మాత్రం ద‌ర్శ‌కుడు టి.కృష్ణ‌. విప్ల‌వ‌భావ‌జాలాలుండే ఆయ‌న స‌మాజంలో జ‌రిగే త‌ప్పుల‌ను త‌న సినిమాల ద్వారా ప్ర‌శ్నించారు. ఆయ‌న తెర‌కెక్కించిన ‘నేటి భార‌తం, దేవాల‌యం, వందేమాత‌రం, ప్ర‌తిఘ‌ట‌న‌, రేప‌టి పౌరులు’ వంటి చిత్రాల‌తో విజ‌య‌శాంతిలోని సిసలైన న‌టిని తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం చేశారు. అలా విజ‌య‌శాంతి ఒక్క వైపు అగ్ర క‌థానాయ‌కుల నాయ‌కిగానూ.. మ‌రోవైపు మ‌హిళ ప్రాధాన్యతా చిత్రాల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. అయితే 1990 జూన్ 29న విడుద‌లైన ‘క‌ర్తవ్యం’ ఆమెకు యాక్ష‌న్ స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. స్టార్ హీరోల‌కు స‌మాన‌మైన మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన చిత్ర‌మిదే. 


లేడీ ఐపీయ‌స్ ఆఫీస‌ర్ కిర‌ణ్ బేడీ ప్రేర‌ణ‌తో సినిమా చేద్దామ‌ని డైరెక్ట‌ర్ మోహ‌న‌గాంధీ త‌న ఆలోచ‌న‌ను నిర్మాత ఎ.ఎం.ర‌త్నంకు చెప్పారు. ఆయ‌నకు న‌చ్చింది. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ‌ను సిద్ధం చేశారు. ఓ న‌గ‌రంలో అన్యాయాలు, అక్ర‌మాలు చేసే రాజ‌కీయ నాయ‌కుడు ముద్దుకృష్ణ‌య్య‌కు, సిన్సియ‌ర్‌ పోలీస్ ఆఫీస‌ర్ వైజ‌యంతీకి మ‌ధ్య జ‌రిగే పోరాటమే ‘క‌ర్త‌వ్యం’. 


1989 న‌వంబ‌ర్ 2న ఈ షూటింగ్ మొద‌లైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి ప్రేమ్ ‌చంద్‌ (టి.కృష్ణ పెద్ద కొడుకు) కెమెరా స్విచ్ఛాన్ చేయ‌గా, కిర‌ణ్ బేడీ క్లాప్ కొట్టారు. క్లైమాక్స్ మిన‌హా సినిమాను మ్ర‌దాస్‌, వైజాగ్‌ల్లో పూర్తి చేశారు. డెఫిసిట్‌లో నిర్మాత ఎ.ఎం.ర‌త్నం సినిమాను విడుద‌ల చేశారు. తొలి ఆట‌కే సినిమా హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఆ రోజుల్లో మూడు కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసి ట్రేడ్ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచిన చిత్ర‌మిది. 1990 అక్టోబర్ 7న మద్రాసులోని విజయా మహాల్‌లో వంద రోజుల వేడుక‌ను చేశారు. ఈ వేడుక‌కి ఐపీయ‌స్ ఆఫీస‌ర్ కిర‌ణ్ బేడీతో పాటు నంద‌మూరి బాల‌కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. 


విజ‌య‌శాంతికి లేడీ అమితాబ్ అనే ఇమేజ్‌తో పాటు జాతీయ ఉత్త‌మ‌న‌టిగా అవార్డును తెచ్చి పెట్టింది ‘క‌ర్త‌వ్యం’ అలాగే ఫిలింఫేర్, నంది అవార్డులను కూడా అందుకున్నారు. త‌మిళంలో ‘వైజ‌యంతి ఐపీయ‌స్’ పేరుతో  అనువాదమై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. హిందీలోనూ ‘తేజ‌స్విని’ పేరుతో రీమేక్ అయ్యింది. హిందీలోనూ విజ‌య‌శాంతినే టైటిల్ రోల్ పోషించారు. అక్క‌డి కూడా ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంది. 

Updated Date - 2020-06-29T14:26:51+05:30 IST