చిరు సినిమాకు 30.. దాసరి సినిమాకు 40

ABN , First Publish Date - 2020-11-14T04:23:15+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'రాజా విక్రమార్క' చిత్రం 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే.. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 'స్వప్న' చిత్రం

చిరు సినిమాకు 30.. దాసరి సినిమాకు 40

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'రాజా విక్రమార్క' చిత్రం 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే.. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 'స్వప్న' చిత్రం 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందామా. మెగాస్టార్ చిరంజీవి, అందాలతారలు అమల, రాధిక జంటగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రాజా విక్రమార్క'. ఈ చిత్రం నవంబర్ 14తో 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ప్రభు హీరోగా తమిళంలో తెరకెక్కిన 'మై డియర్ మార్తాండన్' ఆధారంగా 'రాజా విక్రమార్క' తెరకెక్కింది. ఆ మాటకొస్తే 'కమింగ్ టు అమెరికా' హాలీవుడ్ ఆధారంగా ఆ తమిళ చిత్రం రూపొందింది. రాజ్-కోటి సంగీతం సమకూర్చిన 'రాజా విక్రమార్క' పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. ముఖ్యంగా అప్పట్లో పాకిస్థాన్ ఎన్నికల సమయంలో బెనజీర్ భుట్టో పార్టీ ప్రచారగీతంగా రూపొందిన పాట ట్యూన్ ను తీసుకొని ఇందులోని 'భళా చాంగుభళా...' సాంగ్ రూపొందించారు. ఈ పాట అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. 


దాసరి 'స్వప్న' చిత్రానికి నలభై ఏళ్ళు 

దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ప్రేమకథా చిత్రం 'స్వప్న'. ఈ చిత్రం నవంబర్ 14తో నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా ద్వారానే స్వప్న నాయికగా పరిచయం కాగా, రాజా, రామ్ జీ హీరోలుగా జనం ముందు నిలిచారు. రాజ్ కపూర్ 'సంగం' పోలికలు ఈ సినిమాలో కనిపిస్తాయి. జగదీశ్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రానికి సత్యం సమకూర్చిన సంగీతం ఓ ఎస్సెట్. "ఇదే నా మొదటి ప్రేమలేఖ.." పాట, "అంకితం నీకే అంకితం..." అనే పాట ఆ రోజుల్లో యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Updated Date - 2020-11-14T04:23:15+05:30 IST